నాపరాయి పరిశ్రమల విద్యుత్‌కు
యూనిట్‌కు రూ. 2 తగ్గిస్తాం
- మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి
- గనుల యజమానులతో ఆత్మీయ సమావేశం - పలు సమస్యలను విన్నవించిన యజమానులు
ప్రజాశక్తి - బనగానపల్లె రూరల్
నాపరాతి పరిశ్రమపై ఆధారపడి జీవించే ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, నాపరాతి పరిశ్రమకు యూనిట్‌కు రెండు రూపాయలు విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని రాష్ట్ర విద్యుత్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని మండల అభివృద్ధి కార్యాలయ ఆవరణంలో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన నాపరాయి మైనింగ్ పరిశ్రమల పరిస్థితులపై గనుల యజమానులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డిలు విచ్చేశారు. నాపరాయి మైనింగ్ పరిశ్రమలకు సంబంధించిన సమస్యలపై లీజుదారులు, పరిశ్రమల యజమానులతో చర్చించారు. జీవో-65 ప్రకారం 'డెడ్ రెంట్' కట్టడంలోని ఇబ్బందులను మంత్రులకు నాపరాయి పరిశ్రమ యజమానులు వివరించారు. డెడ్ రెంట్ సంవత్సరంలో ఎప్పుడైనా కట్టే పాత పద్ధతిని మార్చి కొత్తగా ఏడాదిలో నాలుగు సార్లు కట్టడం వల్ల, రాయల్టీ నిధులు వెనక్కి పోతుండడాన్ని మంత్రుల దృష్టికి తెచ్చారు. నాపరాయి పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, సిఎఫ్‌ఒ, సిఎఫ్‌ఇ, ప్రతి ఏడాది కొనసాగించడం లీజుదారులకు ఇబ్బందికరం, రెన్యువల్‌లా కాకుండా ఒకేసారి కట్టేలా ప్రభుత్వం సహకరించాలని, పరిశ్రమలకు అనుమతుల విషయంలో సరళమైన పాత విధానాలను కొనసాగించాలని యజమానులు కోరారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వందలాది మందికి ఉపాధి కల్పించడంలో నాపరాయి పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. వెహికిల్ ట్రాకింగ్ సిస్టంపైనా వెసులుబాటు దిశగా సమీక్షిస్తామని చెప్పారు. రెన్యువల్‌పై, డెడ్ రెంట్ మూడు నెలలకోసారి కట్టే పద్ధతిపై యజమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. అనుమతుల విషయంలో నిబంధనలను పాటించాలన్నారు. క్లస్టర్ల ద్వారా పరిశ్రమలు ముందుకువెళ్లాలని, టిడిపి పాలనలో నాపరాయి పరిశ్రమలకు రాయల్టీలు పెరిగినప్పుడు పోరాడి తగ్గించింది తామే అన్నారు. డిఎంఎఫ్' నిధుల ద్వారా బనగానపల్లె మౌలికసదుపాయల కల్పనకు పెద్దపీట వేశామని చెప్పారు. మైనింగ్ ఉత్పత్తుల విషయంలో గడువుపై మరింత అధ్యయనం చేస్తామని తెలిపారు. బనగానపల్లెలో నాపరాతి యజమానులకు ఏ ఇబ్బంది వచ్చినా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారని, సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తెస్తున్నట్లు తెలిపారు. డెడ్‌రెంటు 10 రెట్లు పెట్టారన్న మైనింగ్ యజమానుల వినతిని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. దీనిని 5 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపారు. సిఎఫ్‌ఇ, సిఎఫ్‌ఓ విషయంలో మూడేళ్ల గడువును 5 సంవత్సరాలలోపు కట్టుకునేలా పొడిగిస్తామన్నారు. క్వారీడెడ్ రెంటు కాల వ్యవధిపై అధ్యయనం చేసి సానుకూల నిర్ణయం తీసుకుంటమని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ బనగానపల్లె నియోజకవర్గంలో పరిశ్రమ మనుగడ కొనసాగించడం కష్టతరంగా సాగుతుందని, ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు లీజుదారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. పరిశ్రమలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, వైసిపి అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, యువ నాయకులు కాటసాని ఓబుల్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గుండం శేషి రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వర రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త శనివారపు వెంకటరామిరెడ్డి, నాపరాయి పరిశ్రమలు, లారీల యజమానులు, లీజుదారులు తదితరులు పాల్గొన్నారు.