ప్రజాశక్తి-రాంబిల్లి
మండలంలోని పెద్ద కలవలపల్లి గ్రామంలో రైతులకు సమాచారం ఇవ్వకుండా జిరాయితీ భూముల్లో డిఆర్‌డిఓ వారు ప్రహరీ నిర్మాణం చేయడాన్ని నిరసిస్తూ కొన్ని రోజులుగా బాధితులు గుడి వద్ద టెంట్ వేసుకుని చేపడుతున్న నిరసనపై పోలీసులు, రెవెన్యూ అధికారులు విరుచుకుపడ్డారు. వారి నిరసన శిబిరాన్ని మంగళవారం పోలీసుల, రెవెన్యూ అధికారులు తొలగించారు. 15 రోజుల క్రితం గోడ నిర్మాణ పనులను బాధిత రైతులు, మహిళలు అడ్డుకొని, నిరసన కార్యక్రమం చేపట్టగా, మండల రెవెన్యూ అధికారులు, రాంబిల్లి పోలీసులు సర్వే చేశాకే గోడ కడతారని చెప్పారు. కాని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న శిబిరాన్ని మంగళవారం బలవంతంగా టెంట్‌ను లాగిపడేయడంపై మహిళలు మండిపడ్డారు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో వాగ్వివాదం చేశారు. సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులే ఇలా చేస్తే తమ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని నిలదీశారు. టెంట్ తీసి వేసినా, తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఇక్కడే కూర్చుంటామని నిరనసకారులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో రావి మణి, రావి వరహాలమ్మ, రావి అంజమ్మ, సేనాపతి నాగేశ్వరి, రావి శేషమ్మ, రావి చెల్లయమ్మ, రావి దుర్గమ్మ పాల్గొన్నారు.