జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : నూతన తరహా న్యాయసేవా శిబిరాలను ఏర్పాటు చేసి న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యం అని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి అరుణ సారిక స్పష్టం చేశారు. జాతీయ న్యాయసేవా దినోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కష్ణా జిల్లా, మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తొలుత న్యాయ మూర్తి అరుణ సారిక మాట్లాడుతూ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఈ సంవత్సర కాలంలో 1,36,623 కేసులను లోక్ అదాలత్ ల ద్వారా పరిష్కరించడం జరిగిందన్నారు. 540 న్యాయవిజ్ఞాన సదస్సులను నిర్వహించి, 389 మందికి న్యాయసహాయం అందించామన్నారు. ప్రజలందరూ కూడా ఈ న్యాయసేవా ధికార సంస్థ సేవలను ఉపయోగించు కోవాలని కార్యదర్శి కె వి రామకష్ణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయ వాదులు, పోలీసులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.