పార్వతీపురంరూరల్: పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న లక్షల రూపాయల నగదు చెదలపట్టి పనికి రాకుండా పోయి నిస్సహాయ స్ధితిలో ఉన్న ఒక కుటుంబాన్ని తనకు ఏమీ సంబంధం లేకపోయినా సోషల్‌మీడియాలో విషయం తెలుసుకున్న ఒక పెద్దమనిషి పెద్ద మనసుతో ఆదుకుని ఆ కుటుంబానికి రూ.2లక్షలు సాయం అందించిన సంఘటన పార్వతీపురం మండలం పుట్టూరులో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పుట్టూరుకు చెందిన ఆదిమూలం లక్ష్మణరావు దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొద్దిరోజులు క్రితం 14ఏళ్ల వయసు గల తన కుమారుడు, డాబా నుండి కిందపడిపోయి మరణించారు. 7,3 తరగతులు చదువుతున్న తమ కుమార్తె చదువు నిమిత్తం నగదురూపంలో ఇంట్లోని చెక్కపెట్టెలో దాచుకోగా, లక్షరూపాయల నగదును చెద్దలు కొట్టేయడంతో గుండెలు అవిసేలా రోధించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న డాక్టర్ రఘురామ్ అనే వైద్యుడు ఆ కుటుంబ వివరాలు కనుక్కుని ఆపేద దంపతుల బ్యాంకు ఎకౌంట్‌లో రెండులక్షల రూపాయలు ఆడపిల్లల చదువుల నిమిత్తం డిపాజిట్ చేసి తన ఔదర్యాన్ని చాటుకున్నారు. వైద్యుని పెద్ద మనసుకు ఆ కుటుంబంతో పాటు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.