Nov 16,2023 21:54

ప్రజాశక్తి - గోకవరం ప్రభుత్వ పెన్షనర్స్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మోసం చేసిందని పెన్షనర్స్‌ అసోసియేషన్‌ మండల ప్రధాన కార్యదర్శి బత్తుల మంగరాజు అన్నారు. పెన్షన్‌ ఫౌండేషన్‌ దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్‌టిసి డిపో వద్ద గురువారం పెన్షన్‌ విద్రోహ దినం సందర్భంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగరాజు మాట్లాడుతూ 1995 నవంబర్‌ 26న కేంద్రప్రభుత్వం ఇపిఎస్‌-95 అనే పెన్షన్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికి ఈ పెన్షన్‌ వర్తిస్తుందని వివరించారు. ఈ పెన్షన్‌ రూ.1000 లోపు పెన్షన్‌ పొందడం జరుగుతుందని, ఈ పెన్షన్‌ వల్ల కుటుంబ పోషణ కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పలు దఫాలుగా కార్మికులు అధికారులకు విన్నవించినా మార్పులు చేస్తామని కేంద్రంలోని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. గత 28 సంవత్సరాలుగా ఒక్క రూపాయిని కూడా అదనంగా పెంచింది లేదన్నారు. 2014లో లోక్‌సభలో జవదేకర్‌ పెన్షన్‌ను రూ.5 వేలు చేస్తామని ప్రకటించారని, అయితే తొమ్మిదిన్నరేళ్లు అవుతున్నా ఒక్క రూపాయి కూడా పెంపుదల చేయలేదని ఆయన ఆరోపించారు. కేంద్రప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ పెన్షన్‌ ఫౌండేషన్‌ డేని విద్రోహ దినంగా పెన్షనర్స్‌ భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం కనిస వేతనం రూ.18 వేలు ఇస్తుందని, దానిలో సగం రూ.9 వేలను పెన్షన్‌గా ఇవ్వాలని, మెడికల్‌ సౌకర్యాన్ని కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వై.మాధవరావు, పి.సత్యనారాయణ, ఎం.నాగేశ్వరరావు, ఎ.సత్యనారాయణ, బి.సుబ్బారావు, సి.నాగేశ్వరరావు, వై.పెరిమల్లు, జి.ప్రసాద్‌ పాల్గొన్నారు.