ప్రజాశక్తి-సింహాచలం : పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గాజువాకలో జరిగిన కార్యక్రమంలో ఉత్తరాంధ్ర వైసిపి రీజనల్ కో-ఆర్డినేటర్ వైవి.సుబ్బారెడ్డికి సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజా రైతు సంక్షేమ సంఘం సభ్యులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లగా సాగుతున్న పంచ గ్రామాల భూ సమస్యకు వైసిపి ప్రభుత్వం కమిటీ వేసి నాలుగున్నరేళ్లు అయినా పరిష్కారం కాలేదన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన 1996 పట్టాను రద్దు చేయడం ద్వారా సమస్య పరిష్కారమవుతుందని వివరించారు. సుబ్బారెడ్డి సానుకూలంగా స్పందించి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచ గ్రామాల భూ సమస్య బాధితులు, స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు వెంకటేశ్వరరావు, ఆనంద్‌కుమార్, సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం కార్యదర్శి టివి.కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.