ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్ పోలీసు సిబ్బంది తమ సంపూర్ణ ఆరోగ్యం కొరకు, నిత్యం ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకునేందుకు, వ్యాయామం, యోగ ప్రతిరోజూ తప్పనిసరిగా చేయాలని జిల్లా ఎస్‌పి పి.జగదీష్ అన్నారు. ధవలేశ్వరం పోలీస్ స్టేషన్ ఆవరణంలో పోలీస్ వెల్ఫేర్ నిధుల నుంచి నూతనంగా ఏర్పాటు చేసిన రెండు షటిల్ కోర్టులను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉదయం ఏదో ఒక వ్యాయామం చేయాలని సూచించారు. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలని అన్నారు. వ్యాయామం, యోగ చేయడం ద్వారా తమ మానసిక స్థితి, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవచ్చన్నారు. ఈ ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఈ సెటిల్ కోర్ట్‌లు అందుబాటులో ఉన్నందున వారి ఖాళీ సమయంలో షటిల్ ఆడుకోవచ్చునని, అలాగే ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ధవలేశ్వరంలో ఉన్న యువత పోలీసు వారితో కలిసి ఈ షటిల్ గ్రౌండ్‌ను ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. అలాగే పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులు ఈ షటిల్ గ్రౌండ్ వినియోగించు కోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్‌పి ధవలేశ్వరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్‌పి రామవర్మ, సౌత్ జోన్ డిఎస్‌పి ఎ.శ్రీనివాస్, సిఐ మంగాదేవి, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.