ప్రజాశక్తి - సీతంపేట : జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా రాష్ట్ర గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణా సంస్థ ఆదేశాల మేరకు స్థానిక ఐటిడిఎ పరిధిలో గల పాఠశాలల్లోని విద్యార్థులకు ఐటిడిఎ స్థాయి క్రీడా పోటీలను సోమవారం గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో నిర్వహించారు. వాలీబాల్, ఆర్చరీ, జావెలిన్ త్రో విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు స్థానిక ఎంపిడిఒ గీతాంజలి, ఐటిడిఎ డిప్యూటీ డిఇఒ లిల్లీరాణి పాల్గొన్నారు. పాఠశాల, క్లస్టర్ స్థాయిలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఐటిడిఎ స్థాయి పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారు ఈనెల 23న రాష్ట్ర స్థాయిలో క్రీడాపోటీల్లో పాల్గొంటారని తెలిపారు. వీటితో పాటు వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలను కూడా నిర్వహించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ ఇన్‌ఛార్జి జాకబ్ దయానందం, ఎఎంఒ కోటిబాబు, జిసిడిఒ రాములమ్మ, ఇతర పీడీలు, పిఇటిలు పాల్గొన్నారు.