ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ కార్యకర్తల విస్తృత సమావేశం గంగవరంలోని మంచాల రంగమ్మ, వెంకటరామయ్య కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వలేటి కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు పరిష్కారం కావాలంటే పార్టీలకతీతంగా రైతులంతా ఐక్యమై పటిష్టమైన పోరాటం చేయటమే మార్గమని అన్నారు. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 27, 28తేదీల్లో విజయవాడ జింఖానా గ్రౌండ్లో జరిగే ధర్నాలో రైతులు వేలాదిగా హాజరై పాలకవర్గాలను హెచ్చరించాలని కోరారు. ఢిల్లీ రైతు ఉద్యమస్ఫూర్తితో సంయుక్త కిసాన్ మోర్చా పిలుపును రైతులంతా జయప్రదం చేయాలని కోరారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకగ్రీవంగా ఆమోదించారు. పంటలన్నింటికీ సమగ్ర ఉత్పత్తి వ్యయ్యానికి 50శాతం పెంచి గిట్టుబాటు ధరలు నిర్ణయించి చట్టబద్ధం చేయాలని కోరారు. ధర తగ్గినప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నారు. రైతుల పాలిట ఉరితాడుగా ఉన్న నూతన విద్యుత్ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును అడ్డుకోవాలని అన్నారు. రైతులు, కౌలు రైతులందరికీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు అందించాలని కోరారు. వడ్డీలను రద్దు చేయాలని అన్నారు. కార్పోరేట్ అనుకూల ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని రద్దుచేసి సమగ్ర పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. వాతావరణ బీమా అమలు చేయాలని కోరారు. వ్యవసాయ ఉపకరణాలు, నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తగ్గించాలన్నారు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని కోరారు. కృష్ణా జలాల పునః పంపిణీ ఆలోచనను కేంద్రం వెనక్కి తీసుకోవాలని కోరారు. రీ సర్వేలో జరుగుతున్న పొరపాట్లను సరిచేసి ప్రతి రైతుకు అతని భూమి వివరాలను పాసుపుస్తకంలో స్పష్టంగా పేర్కొనాలని కోరారు. పాస్‌పుస్తకాలపై సిఎం ఫోటోలను తీసివేయాలని అన్నారు. విజయవాడ ధర్నాను జయప్రదం చేసేందుకు విస్తృత ప్రచారం చేసి రైతులను కదిలించాలని సమావేశంలో తీర్మానించారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు కందిమళ్ళ రామకోటేశ్వరావు, రాయిని వినోద్, బాచిన కోటేశ్వరావు, ఎర్రం గోవిందరెడ్డి, పాలెపు సాంబయ్య, రామాంజనేయులు, మాదాల అంజయ్య, నాగబోయిన సింగారావు, నాగేశ్వరరావు, ఆదియ, బండి సాంబయ్య, శేషాద్రి, మోహన్ రావు, హరిబాబు, సుబ్బారావు, మల్లారెడ్డి పాల్గొన్నారు.