ప్రజలకు ప్రభుత్వానికి వారధి లాంటివి పత్రికలు
జర్నలిస్ట్ సంఘం మాజీ సహాయ కార్యదర్శి గుంపుల వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి - పగిడ్యాల
ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా పనిచేసేవి పత్రికలని ఉమ్మడి కర్నూలు జిల్లా జర్నలిస్ట్ సంఘం మాజీ సహాయ కార్యదర్శి గుంపుల వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా గుంపుల వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడారు. పత్రికలు ఏ ప్రభుత్వానికైనా ఆత్మలాంటివి అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారని ఆయన తెలిపారు. ఒక సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పత్రిక ముఖ్య సాధనల ఉపయోగపడతాయని నిమ్మల జాతులకు సామాన్య ప్రజలకు సాంఘిక రాజకీయ అవగాహన కల్పించడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆంగ్లం, మరాఠీలో పలు పత్రికలను నడిపారని అన్నారు. పక్షులకు ఏ విధంగా రెక్కలు అవసరమో అదేవిధంగా మన ఆలోచనలను ప్రజలకు చేరవేయడానికి వార్తాపత్రికలు ఎంతో అవసరమని అంబేద్కర్ ఎన్నో పక్ష పత్రికలో నడిపారని అన్నారు. పత్రికలు ఎప్పుడు కూడా ఒక లక్ష్యంతో ఉండాలని ఒక ప్రయోజనంతో ఉండాలని పత్రికల్లో ఏ వ్యక్తి పట్ల పక్షపాతం ఉండకూడదని అంబేద్కర్ అన్నారని ఆయన తెలిపారు. నేడు నడుస్తున్న పత్రికలు ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసేవేనని ఒక నాయకుడికీ పక్షపాతంగా ఉంటున్నాయని అన్నారు. పత్రిక ఉద్దేశం ధనం సంపాదించడం కాదని ప్రజలను చైతన్య పరచడం కోసం తీసుకున్న దీక్ష అని అంబేద్కర్ భావించారన్నారు. ప్రజలను చైతన్యం తీసుకురావడానికి అంబేద్కర్ ఎన్నో పత్రికలు నడిపారన్నారు. వ్యక్తి కంటే సంఘం ముఖ్యం అని అందుకే సంఘాన్ని జాగ్రత్తపరిచేందుకే ఆయన పత్రికలను ఆయుధంగా ఎంచుకున్నారని అన్నారు. ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా పత్రిక రంగంలో అంకితభావంతో పనిచేస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ జాతీయ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలను ఆయన తెలిపారు.