Feb 20,2022 13:11

పసిఫిక్‌ మహాసముద్రంలోని టోంగా సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ ప్రభావంతో తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బూడిద ఆవరించింది. ఆకాశంలో 20 కిలోమీటర్ల ఎత్తు వరకూ బూడిద మేఘాలు అలుముకున్నాయి. భారీ ప్రకంపనల కారణంగా.. సముద్ర జలాలు ముందుకు చొచ్చుకునిరాగా.. కొన్ని దేశాలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. అమెరికా సహా పలు దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అసలు పసిఫిక్‌ మహాసముద్రంలో ఏం జరుగుతుంది? పదేపదే సునామీలు రావడానికి కారణాలేంటి? వంటి విషయాలు తెలుసుకుందాం..!

 

పసిఫిక్‌లో అగ్నిపర్వతాల విస్ఫోటనం..



    ఓ వైపు గ్లోబల్‌ వార్మింగ్‌, మరోవైపు భూకంపాలు, సునామీలు అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. పైగా గ్లోబల్‌ వార్మింగ్‌ని నియంత్రించేందుకు అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాకపోవడం గమనార్హం. అయితే తాజాగా అగ్రరాజ్యం అమెరికాతోపాటు పసిఫిక్‌ సముద్ర తీరం ఉన్న పలు దేశాలకూ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దక్షిణ పసిఫిక్‌లోని ద్వీప దేశం టోంగాలో సముద్రం అడుగున ఉన్న భారీ అగ్నిపర్వతం.. కనీ వినీ ఎరుగని రీతిలో విస్ఫోటనం చెందడంతో సముద్రంలో భూకంపం చెలరేగి, భారీ సునామీ అలలు ఏర్పడ్డాయి. అమెరికా పశ్చిమ తీరంతోపాటు టోంగా, ఫిజీ, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా దేశాల్లో భారీ సునామీ రావొచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
    కాగా ఈ టోంగా అగ్నిపర్వతం బద్దలైన భారీ విస్పోటనానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అక్కడి స్థానికులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎనిమిది నిమిషాల పాటు సంభవించిన ఈ పేలుడు భీభత్సంగా ఉందని, దీనికి 800 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న ఫిజీలో 'పెద్ద ఉరుముల్లాంటి శబ్దాలు' వినిపించాయని రాజధాని సువాలోని అధికారులు వివరించారు.

 

పసిఫిక్‌లో అగ్నిపర్వతాల విస్ఫోటనం..


 

                                        20 కిలోమీటర్లు విస్తరించిన వాయువులు..

అగ్నిపర్వతం బద్ధలవడం వల్ల వెలువడిన వాయువులు, పొగ, బూడిద... ఆకాశంలో 20 కి.మీ. ఎత్తు వరకూ విస్తరించాయని టోంగా జియోలాజికల్‌ సర్వీసెస్‌ చెప్పింది. 'హుంగా టోంగా-హుంగా హాపై' అగ్ని పర్వతశ్రేణికి ఉత్తరాన 65 కి.మీ దూరంలోనే టోంగా రాజధాని 'నుకులోఫా' ఉంటుంది. అక్కడ 1.2 మీ. ఎత్తున్న సునామీ అలలు కనిపించాయని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ పేర్కొంది. 'దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన, అసాధారణమైన వరదలు, తీర ప్రాంతాల్లో అనూహ్యమైన ఉప్పెనలు వచ్చే అవకాశముంది' అని నేషనల్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ తెలిపింది.
    టోంగాలోని పసిఫిక్‌ మహాసముద్రంలో భారీ అగ్నిపర్వత విస్ఫోటనం, సునామీ అలలు హవాయిలో తక్కువ-స్థాయి వరదలను ప్రేరేపించడంతో మొత్తం అమెరికా వెస్ట్‌ కోస్ట్‌కు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు.
    కాగా అమెరికా నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ కాలిఫోర్నియా దిగువ నుండి అలాస్కా యొక్క అలూటియన్‌ దీవుల కొన వరకూ సునామీ సలహాలను జారీ చేసింది, రెండు అడుగుల (60 సెంటీమీటర్లు), బలమైన రిప్‌ ప్రవాహాలు, తీరప్రాంత వరదలను అంచనా వేసింది. 'ఈ ప్రాంతాల్లో బీచ్‌లు, నౌకాశ్రయాలు, మెరీనాల నుంచి బయటకు వెళ్లండి' అని అందరికీ హెచ్చరికలు జారీ చేసింది.
 

                                        న్యూజిలాండ్‌.. అమెరికాలో అలర్ట్‌..

భయంకరమైన అగ్నిపర్వత విస్ఫోటనం తర్వాత ఫిజీ.. న్యూజిలాండ్‌ కూడా సునామీ హెచ్చరికను జారీ చేశాయి. యూఎస్‌ పశ్చిమ చివరలో ఉన్న శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు సముద్ర తీరాలకు దూరంగా ఉండాలని అగ్నిమాపక దళం, పోలీసులు కోరారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5.10 గంటలకు టోంగాలో అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించింది. ఇరవై నిమిషాల తరువాత, సునామీ అలలు వీధులు, గృహాలు.. భవనాలను తాకడం ప్రారంభించాయి. దాని ఫోటోలను శాటిలైట్స్‌ చిత్రీకరించాయి.

పసిఫిక్‌లో అగ్నిపర్వతాల విస్ఫోటనం..


 

                                      టోంగాలో విమాన సేవలు నిలిపివేత..

ఆకాశంలో పెద్ద ఎత్తున అగ్నిపర్వతం విస్ఫోటనం నుంచి వెలువడిన బూడిద దట్టంగా పేరుకుంది. సునామీ తాకడంతో టోంగాలో విమాన సేవలు వెంటనే నిలిపివేశారు. టోంగా జియోలాజికల్‌ సర్వీసెస్‌ ప్రకారం, పేలుడు వ్యాసార్థం దాదాపు 260 కి.మీ. దీవికి సమీపంలోని సముద్రంలో గతేడాది డిసెంబర్‌ నుంచి అగ్నిపర్వతం అడపాదడపా బద్ధలవుతోంది. అయితే ఈసారి అగ్నిపర్వతంలో చాలా బలమైన పేలుడు సంభవించింది.
 

                                    సముద్ర అంతర్భాగంలో అగ్నిపర్వతాలు..

టోంగా జియోలాజికల్‌ సర్వీసెస్‌ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. పసిఫిక్‌లో అనేక ద్వీపదేశాలు.. మహాసముద్ర అంతర్భాగంలో అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి. టోంగాకు సమీపాన అగ్నిపర్వతం హుంగా టోంగా-హుంగా హాపై హఠాత్తుగా బద్ధలైంది. విస్ఫోటనం తాలూకు శబ్దాలు ఎనిమిది నిమిషాల పాటు కొనసాగాయి. విస్ఫోటనం తీవ్రత ఎంతగా ఉందంటే, అక్కడికి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిజీ దీవుల్లోనూ శబ్దాలు వినిపించాయట!. కాగా సముద్రంలో అగ్నిపర్వతం పేలుడును పలు శాటిలైట్లు చిత్రీకరించాయి. హిమావరీ శాటిలైట్‌ చిత్రీకరించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మరోవైపు కొన్ని పాత, ఫేక్‌ వీడియోలు సైతం సునామీ పేరిట వైరల్‌ అవుతున్నాయి.