రైతన్నకు సాగునీటి కష్టాలు
- నవంబర్ చివరి వరకే నీటి విడుదలకు అవకాశం
- చివరాయకట్టుకు అందని సాగునీరు
- ఈ పది రోజుల్లో వర్షాలు పడితేనే మళ్లీ రిజర్వాయర్‌ల్లోకి నీళ్లు
- పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన బాట
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
రైతన్నకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. రబీ సీజన్‌లో వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు వరి, మిరప, పత్తి, జొన్న, శనగ తదితర పంటలను సాగు చేశారు. కానీ ప్రకృతి కరుణించకపోవడంతో రైతులు రబీలోనూ కష్టాలు తప్పడం లేదు. ఈ ఏడాది వర్షాలు ఆశించినంతగా పడకపోవడం, పై నుండి వచ్చిన వరద నీటిని జిల్లాకు ఖరీఫ్, రబీ సాగుకు అవసరమైన నిల్వ ఉంచుకునే రిజర్వాయర్లు లేకపోవడం వంటి కారణాలు రైతన్నకు శాపంగా మారువుతున్నాయి. ఖరీఫ్‌లో రైతులు సాగు చేసుకున్న పంటలకు కూడా పూర్తి స్థాయిలో నీటిని ఇవ్వలేని పరిస్థితి ఉంది.
ప్రస్తుతం సుంకేసుల బ్యారేజ్‌లో 80 వేల క్యూసెక్యుల నీరు, శ్రీశైలం రిజర్వాయర్‌లో 65 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉంది. తెలుగు గంగ రిజర్వాయర్‌లో 5 టిఎంసిలు, గోరుకల్లు రిజర్వాయర్లో ప్రస్తుతం 5.9 టిఎంసిలు, అవుకు రిజర్వాయర్‌లో 1.4 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఈ రిజర్వాయర్‌లలో ఉన్న నీటి లభ్యతను బట్టి వెలుగోడు రిజర్వాయర్ కింద సాగు చేసుకున్న పంటలకు ఈ నెల చివరి వరకు, గోరుకల్లు, అవుకు రిజర్వాయర్ కింద సాగు చేసుకున్న పంటలకు డిసెంబర్ చివరివరకు వార బంధీ ప్రకారం నీళ్లు ఇస్తామని నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. కెసి కెనాల్ కింద సాగు చేసుకున్న వరి, మిర్చి, మినుము పంటలకు పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వలేమని అధికారులు పేర్కొంటున్నారు. వెలుగోడు బాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ఉన్న 5 టిఎంసిల నీటిలో కేవలం 3 టిఎంసిలు మాత్రమే పంట పొలాలకు వాడుకోవడానికి అవకాశం ఉంది. మిగిలిన 2 టిఎంసిలు తాగునీటి అవసరాల కోసం ఉంచారు. ఇదే పరిస్థితి అన్ని రిజర్వాయర్‌లలో ఉంది. రబీలో సాగు చేసిన పంటలకు కెసి కింద చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావడం లేదని, సాగునీరు ఇవ్వాలని నంద్యాల నియోజకవర్గంలోని నంద్యాల, గోస్పాడు మండలం, ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, చాగలమర్రి, దొర్నిపాడు మండలాల అన్నదాతలు ఆందోళన బాటపట్టారు. నీళ్లు ఇవ్వకుంటే పంటలు ఎండిపోతాయని రైతులు వాపోతున్నారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఖరీఫ్‌లో వరితో పాటు మినుము, మిరప, జొన్న, పత్తి తదితర పంటలు సాగు చేశారు. ఎక్కువగా వరి మినుము, మిరప స్టాండింగ్ పంటలు ఉన్నాయి. ఈ పంటలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు పంటలకు అందడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. చివరి ఆయకట్టు వరకు అధికారులు నీళ్లు ఇవ్వకుంటే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. వార బందీ కింద ఇక కేవలం పదిరోజులే ఇచ్చే అవకాశం కెసి కెనాల్‌కు ఉంది. ఆ తరువాత ముచ్చుమర్రి ఎత్తిపోతల స్కీమ్ నుండి పంపింగ్ ద్వారా నీళ్లు కెసికి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నీటి నిల్వలను పట్టి చూస్తే రైతన్నకు నీటి కష్టాలు తప్పేలా లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ పది రోజుల్లో వరుణుడు కరుణిస్తేనే రైతన్నకు నీటి కష్టాల బయటే పడే అవకాశం ఉంటుందని నీటి పారుదల అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జనవరి చివరి వరకు సాగు నీరు ఇవ్వాలి
నంద్యాల జిల్లాలో ఇరిగేషన్ అధికారులు నవంబర్ నెల చివరి వరకు మాత్రమే సాగునీరు అందిస్తామని ప్రకటిస్తున్నారు. అందువల్ల జిల్లాలో పంటలు సాగు చేసుకున్న రైతాంగం తీవ్రంగా నష్టపోతారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు సాగు నీటి ప్రకటనల వల్ల తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని జనవరి నెల చివరి వరకు కెసి కెనాల్, తెలుగంగ కాలువ ద్వారా సాగునీరు విడుదల చేసి పంటలు ఎండిపోకుండా చూడాలి. రైతాంగాన్ని ఆదుకోవాలి..
టి. రామచంద్రుడు, ఎపి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి.
కెసికి రెగ్యులర్‌గా నీళ్లు ఇచ్చి మిర్చి పంటను కాపాడాలి
నేను రెండు ఎకరాల్లో మిరప పంట సాగు చేశాను. ఇంకా పూతకే రాలేదు.. అధికారులు మాత్రం సక్రమంగా సాగునీరు ఇవ్వడం లేదు. ఇప్పటికే పంటకు దాదాపు 80 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాను. పంట చేతికి రావాలంటే సాగు నీరు చాలా అవసరం.. కాబట్టి కెసి కెనాల్‌కు రెగ్యులర్ గా నీళ్లు ఇచ్చి మిర్చి రైతులను ఆదుకోవాలి.
ఎన్.చెన్నయ్య, మిరప రైతు, పసురపాడు గ్రామం.
పంట ఎండితే అప్పుల పాలే..
పుసులూరు గ్రామంలో 20 ఎకరాలు కౌలుకు తీసుకుని జొన్న పంట వేశాను. విత్తనం వేసినది మొదలుకొని ఇంతవరకు కాలువకు చుక్క నీరు రాలేదు. జొన్న పంట అంతా ఎండిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక ఆకాశం వైపు చూస్తే మేఘాలు కూడా కరుణించడం లేదు. భూమిని నమ్ముకుని పెట్టుబడికి అప్పులు చేశాను. కాలువకు నీరు రాకపోతే పంటలు ఎండిపోయి అప్పులపాలు కావ్వాల్సిందే.
కౌలు రైతు మహేశ్వర్ రెడ్డి, కొత్తపల్లి గ్రామం, నంద్యాల మండలం.