Nov 19,2023 22:21

నంబకంలో నూతన రైతు భరోసా కేంద్రం ప్రారంభం
ప్రజాశక్తి- నగరి: రైతు పక్షాన ప్రభుత్వం ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన సర్వీసుల క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆదివారం మండలంలోని నంబకం గ్రామంలో రూ.21.80 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రైతు భరోసా కేంద్రాన్ని ఆమె ప్రారంభించి రైతులకు అందుబాటులో తెచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రైతుకు అన్నిరకాల సదుపాయాలను అందుబాటులోనే అందించడానికి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. విత్తనాలు ఎరువులు దూర ప్రాంతాలకు వెళ్లి తీసుకువచ్చే కష్టం లేకుండా గ్రామాల్లోని రైతుభరోసా కేంద్రంలోని పొందవచ్చు అన్నారు. వ్యవసాయ సంబంధిత సలహాలు కూడా రైతుకు అత్యంత సమీపంగానే అందుతుందన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగ అంటూ పక్కకు నెడితే ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగగా మార్చింది అన్నారు. రైతు పక్షాన నిలబడే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భార్గవి, వైస్‌ ఎంపీపీలు కన్నయ్యప్ప, ఢిల్లీ, ఆర్‌బికే ఛైర్మన్‌ బుచ్చిరెడ్డి, పిఎసిఎస్‌ చైర్మన్‌ తిరుమలరెడ్డి, ఎంపీడీవో లీలా మాధవి, వ్యవసాయ అధికారి రాఘవేంద్ర యాదవ్‌, ఎంపీటీసీ గుణశేఖర్‌రెడ్డి, సర్పంచులు, పాల్గొన్నారు.