Nov 16,2023 19:27

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

సాగునీటి కోసం మోటార్లు వినియోగిస్తే చర్యలు
- ప్రధాన కాలువ తూముల వద్ద రైతులు ఉండరాదు
- జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     కెసి కెనాల్‌ ఆయకట్టు కింద పంటలు సాగు చేసిన రైతులు పంట పొలాలకు మోటార్‌ ఇంజన్ల ద్వారా అక్రమంగా నీటిని వినియోగిస్తే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ సంబంధిత మండలాల తహశీల్దారులు, పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్లో జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కెసి కెనాల్‌ వారబందీ నీటి విడుదలపై ఇరిగేషన్‌, వ్యవసాయ, సంబంధిత మండల తహశీల్దారులు, పోలీసు అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కెసి కెనాల్‌ పరివాహక ప్రాంతంలో అక్రమ నీటి వాడకాన్ని అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. కెసి ప్రధాన కాలువ నుండి మోటార్‌ ఇంజన్ల ద్వారా అక్రమంగా నీటిని వాడితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. తహశీల్దార్‌, ఎంపిడిఒ, కెసి కెనాల్‌ ఇంజనీరింగ్‌ అధికారి, ఎస్సై, వ్యవసాయ అధికారి మండల బృందంగా, విఆర్వో, పంచాయతీ కార్యదర్శి, పోలీస్‌, వ్యవసాయ, ఇరిగేషన్‌ సిబ్బంది గ్రామ బృందాలుగా ఏర్పాటై కాలువల వెంట పర్యవేక్షించాలని ఆదేశించారు. కెసి కెనాల్‌ ప్రధాన కాలువ తూముల సమీపంలో రైతులు ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు. దొర్నిపాడు మండలంలో కొంతమంది రైతులు కెనాల్‌పై అక్రమంగా పైపులు వేసుకొని దిగువ ఆయకట్టుకు నీరందకుండా అడ్డుకుంటున్నారని, స్లూయిస్‌ల దగ్గర ఇష్టం వచ్చినట్లు ఆపరేట్‌ చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కెనాల్‌ మీద వ్యవసాయ మోటార్లు వినియోగించకుండా నిరంత రాయంగా పెట్రోలింగ్‌ నిర్వహించాలని చెప్పారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. పొన్నాపురం నుండి 16వ లాక్‌ వరకు (జిల్లెల), 16వ లాక్‌ నుండి 27వ లాక్‌ వరకు (ఆళ్లగడ్డ) దిగువ ప్రాంత రైతులకు 7 రోజులు చొప్పున వారబందీ ప్రకారం నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కెసి కెనాల్‌ ఈఈని ఆదేశించారు. పై ప్రాంతాల్లో ఉన్న రైతులే నీటిని కట్టుకోకుండా కింది ప్రాంత రైతులకు కూడా నీరు వదిలేందుకు ఒప్పందం చేసుకొని రైతులు సమన్వయంతో వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉన్న నీటి వనరులను చక్కగా సద్వినియోగం చేసుకొని వీలైనంత అధిక ఆయకట్టుకు నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రబీ సీజన్‌లోని పంటలకు నీరు ఇచ్చే అవకాశం లేనందున రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సమాచారం ఇవ్వాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కెసి కెనాల్‌ ఆయకట్టు రైతులకు వారబందీ ప్రకారం నీరు ఇచ్చే సమాచారాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు తెలియజేయాలని సూచించారు.