Nov 08,2023 00:46

వేదికపై మాట్లాడుతున్న జన విజ్ఞాన వేదిక నాయకులు

ప్రజాశక్తి -యంత్రాంగం
గోపాలపట్నం : సమాజంలో శాస్త్రీయ దృక్పథం అవసరమని విశాఖ జిల్లా జన విజ్ఞాన వేదిక కార్యదర్శి కె.శేషగిరిరావు అన్నారు. గోపాలపట్నం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆల్‌ ఇండియా పీపుల్స్‌ నెట్‌వర్క్‌, భారత విజ్ఞాన పరిషత్‌ సంయుక్తంగా శాస్త్రీయ దృక్పథ ప్రచారాన్ని వివిధ కళాల రూపాలు, జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్‌ ప్రోత్సాహక పరీక్షల ద్వారా చేయాలని నిర్ణయించారని తెలిపారు. ఇందులో భాగంగా గోపాలపట్నం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.ఎస్తేర్‌ హెబ్బేబా ఆధ్వర్యాన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. అభ్యుదయ భావాలతో శాస్త్రీయ దృక్పథం ఉన్న నోబుల్‌ లారెట్స్‌, సర్‌ సివి.రామన్‌, మేడం క్యూరీ జయంతిని పురస్కరించుకొని మంగళవారం నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు సైన్స్‌ ప్రమోటింగ్‌ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. సైన్స్‌ ఫెయిర్‌ సెక్యులరిజం, సైన్స్‌ ఫర్‌ డెమోక్రసీ అన్న నినాదాలతో ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. మత, కుల రహిత, స్త్రీ పురుషుల తారతమ్యాలు లేని సమాజ స్థాపనే క్యాంపెయిన్‌ ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షులు ఎం.శ్రీకాంత్‌, సూర్రెడ్డి బాబూరావు, పి.రాధారాణి, ఎస్‌వి.రమణ, ఉపాధ్యాయులు కె.ప్రసాదు, ఎం.రమణబాబు, తదితరులు పాల్గొన్నారు.
శాస్త్ర విజ్ఞానం మనిషి జీవితంలో భాగం
గాజువాక : శాస్త్ర విజ్ఞానం మనిషి జీవితంలో భాగమని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు ఎస్‌వికె.పరశురామ్‌ అన్నారు. ఆల్‌ ఇండియా పీపుల్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌ ఆధ్వర్యాన హైస్కూల్లో మంగళవారం శాస్త్ర విజ్ఞాన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవిజ్ఞాన అభివృద్ధికి మేరీ క్యూరీ చేసిన కృషిని వివరించారు. ఈ సందర్భంగా వివిధ శాస్త్రవేత్తలతో ముద్రించిన పోస్టర్‌ను విద్యార్థుల మధ్య ఆవిష్కరించారు.