సగం కాలిన స్థితిలో మహిళ మృతదేహం
- కేసు నమోదు చేసిన పోలీసులు - ఆత్మహత్యే అంటున్న కుటుంబ సభ్యులు
ప్రజాశక్తి- సోమల: మండల కేంద్రమైన సోమల సమీపంలోని జగనన్న కాలనీ పక్కనున్న జర్నలిస్టులకు కేటాయించిన ఖాళీస్థలంలో మంగళవారం ఉదయం సగం కాలిన స్థితిలో మృతిచెంది ఉన్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పుంగనూరు సిఐ రాఘవరెడ్డి మహిళది హత్యా, ఆత్మహత్య అన్న కోణంలో స్థానికులను విచారించారు. సిఐ తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు కోటీశ్వరయ్య భార్య విజయలక్ష్మి (52) 9 నెలల క్రితం మేడపై నుంచి దిగుతూ కింద పడి కాలు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందారు. శస్త్రచిక్సిత అనంతరం వైద్యుల సలహా మేరకు మాత్రలు మింగుతూ వస్తోందని, పలుమార్లు తాను కాలి నొప్పి భరించలేకుండా ఉన్నానని భర్తతో అనేదని తెలిపారు. ఈక్రమంలో సోమవారం రాత్రి భర్త, కుమారుడు విజయలక్ష్మి కలిసి భోజనం చేసి రాత్రి నిద్రకు ఉపక్రమించారని ఉదయం 5 గంటల ప్రాంతంలో ఇంటిలో విజయలక్ష్మి లేకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతంలో గాలించారని తెలిపారు. ఆదే సమయంలో మహిళ మృతి అన్న సమాచారాన్ని తెలుసుకొని సంఘటన స్థలానికి మతురాలి భర్త, కుమారుడు అఖిల్ చేరుకొని మృతి చెందినది తన తల్లేని గుర్తించాడని, తమకు ఎవరి పైన అనుమానం లేదని తెలిపినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన సీఐ హత్యా, ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.