ప్రజాశక్తి -పాడేరు:పాడేరు జిల్లా ఆసుపత్రి, జిల్లా సత్వర చికిత్సా కేంద్రం (డైక్ సెంటర్) లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పిల్లలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో బాధపడుతున్న 1-19 సంవత్సరములు కలిగిన పిల్లలకు ఉచితముగా మల్టీ విటమిన్ సిరప్, మాత్రలు, తలస్సేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు మాత్రలను ఒక నెలకు సరిపడా అందజేస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి జమాల్ బాషా తెలిపారు. సర్జరీలు అయిన పిల్లలతో పాటు తల్లిదంద్రులకు సలహాలు, ఆరోగ్యకరమైన (చేతులు కడగడం, మంచిగా బ్రష్ చేయటము) అలవాట్లు నేర్పించాలన్నారు.చీలిక పెదవి, అంగిలి కలిగిన పిల్లలకు ఉచితముగా శస్త్రచికిత్సలు చేస్తున్నామన్నారు. శస్త్రచికిత్స అయిన తరువాత పిల్లల తల్లిదండ్రులకు రూ.5000 (వైద్య ఖర్చుల కోసం) వారి వ్యక్తి గత ఖాతాలలో వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, సూపరింటెండెంట్ డాక్టర్ కె. కృష్ణారావు, జిల్లా ఆసుపత్రి, డిఇఐసి వైద్యాధికారి డాక్టర్ కె.బాబ్జీ, డెంటల్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.