Apr 10,2022 12:53

అలసట లేని వలస జీవులవి. అలుపెరుగని ప్రయాణం వాటి జీవన శైలి. సైబీరియా పక్షుల మాదిరిగా కేవలం సంతానోత్పత్తి కోసమే వేల కిలోమీటర్లు ప్రయాణించి సముద్ర తీరానికి చేరుకుంటాయి. ఎన్నో విశేషాలకు నిలయమైన ఆ జీవులు ''ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు''. ప్రస్తుతం సంతానోత్పత్తి కాలం కావడంతో మన రాష్ట్రంలో అనేక సముద్ర తీరాల్లో సందడి చేస్తున్నాయి. వాటి గురించి మరింత లోతుగా తెలుసుకుందాం.

లక్షలు లక్షలుగా వస్తాయి. పక్కా లక్ష్యంతో వస్తాయి. గుడ్లు పెట్టి వెళ్లిపోతాయి. అలలపైన ఇలా వచ్చేవి.. అలా అలలతోనే వెళ్లిపోతాయి. అవే ఆలివ్‌రిడ్లే తాబేళ్లు. అరుదైన ఉభయచర జీవుల్లో అనేక జాతుల తాబేళ్లున్నప్పటికీ ఈ తాబేళ్లకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వీటికి స్థిర నివాసం అంటూ ఏదీ ఉండదు. అవి ఎక్కడైతే పుట్టాయో ఆ ప్రాంత పరిసరాల్లోనే గుడ్లు పెడతాయి. ఏడాదంతా సముద్రంలో ఎక్కడెక్కడ ఉన్నా, గుడ్లు పెట్టే సమయానికి అంటే ఏటా జనవరి నుంచి మార్చి వరకు తల్లి తాబేళ్లు అవి జన్మించిన తీరం దిశగా వచ్చేస్తాయి. తీరం వెంట ఐదారు రోజులు తిరుగాడి, అనువైన ప్రదేశాన్ని ఎంచుకుంటాయి. అర్ధరాత్రి 2 గంటల నుంచి వేకువజాము 5.30 గంటలలోపు తీరానికి చేరుకుని ఇసుక తిన్నెలలో అడుగున్నర లోతున్న బొరియలు చేస్తాయి. ఒక్కో తాబేలు 30 నుంచి 140 వరకు గుడ్లు పెడతాయి. అవి ఎవరి కంటా పడకుండా వాటిపై ఇసుక కప్పేసి మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతాయి. సుమారు నెల రోజుల అనంతరం ఈ గుడ్లు పిల్లలుగా తయారవుతాయి. 28-30 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పొదిగిన పిల్లలు మగ తాబేళ్లుగా, 30-32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పొదిగినవి ఆడ తాబేళ్లుగా పుడతాయి.
     తల్లి తాబేళ్లు వదిలి వెళ్లిన గుడ్లలో నుంచి ఒక్కొక్కటిగా పిల్ల తాబేళ్లు ఇసుకను తొలుచుకుంటూ పైకి వస్తాయి. వీటి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇసుక గూడు నుంచి బయటకు రాగానే, ఎవరో పిలిచినట్టు బుడిబుడి అడుగులేస్తూ సముద్రంవైపు వెళ్లిపోతాయి. పిల్ల తాబేళ్ల ఉత్సాహం చూసేందుకు ఆయా తీరాలకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. అలల తాకిడికి ఒడ్డుకొచ్చి పడుతూ, సముద్రంలోకి మళ్లీవెళుతున్న అదే కెరటంపై తేలియాడుతూ సముద్ర గర్భంలో కలిసిపోతాయి. సముద్ర తాబేళ్లలో ఇవే చిన్నవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పసిఫిక్‌ మహాసముద్రం, అట్లాంటిక్‌ మహాసముద్రం దక్షిణ భాగం, హిందూ మహాసముద్రంలో వీటి ఉనికి ఎక్కువ.
     రెండడుగుల పొడవు, సుమారు 500 కేజీల బరువు ఉండే రిడ్లే తాబేళ్లు ఆహారాన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. వీటిలో ఏడు జాతులుండగా ఐదు జాతుల తాబేళ్లు జపాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తదితర దేశాల నుంచి లక్షలాదిగా ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల తీరాలకు సముద్ర మార్గంలో వలస వస్తూ కనువిందు చేస్తాయి.

 

సంతానోత్పత్తి కోసం అలుపెరగని ప్రయాణం...


 

                                                 మృత్యువాత పడుతున్నాయి

భారీ సైజులో ఉండే రిడ్లే తాబేళ్లకు సముద్ర తీరాల్లో రక్షణ కరువవుతోంది. కుక్కలు, నక్కలు, ఇతర జంతువులు వీటి గుడ్లను తినేస్తుంటాయి. చివరకు కొన్ని మాత్రమే పిల్లలుగా తయారై వాటంతటవే సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. కొన్నిసార్లు ఆ పిల్లలనూ కొన్ని జంతువులు వేటాడి తినేస్తుంటాయి. ఇలా పుట్టినప్పటి నుంచీ సముద్ర తాబేళ్లకు ప్రాణసంకటంగానే ఉంటుంది. గుడ్లు పెట్టడానికి తీరానికి వచ్చిన తాబేళ్లు వచ్చిన బోట్లలో రింగు వలలు, డిస్కో వలలు, మెకనైజ్డ్‌ బోట్ల ఫ్యాన్లకు తగిలి మృతి చెందుతున్నాయి. తీరం నుంచి కొంతదూరం వరకు నిషేధిత వలలు వాడకూడదని నిబంధన ఉన్నా, కొందరి నిర్లక్ష్యం, పర్యవేక్షణా లోపం కారణంగా అవి మృత్యువాత పడుతున్నాయి. అంతేకాదు రాత్రి సమయాల్లో గుడ్లు పొదిగేందుకు వచ్చిన తాబేళ్లనూ వివిధ జంతువులు వేటాడి చంపుతుంటాయి.
    సముద్రంలో కలిసిన పలు వ్యర్థ పదార్థాలను ఈ తాబేళ్లు ఆహారంగా తిని పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంటాయి. మత్స్య సంపదకు ప్లాస్టిక్‌ పదార్థాల వల్ల కలిగే కీడును కొంతవరకు ఇవి అరికడతాయి. ఈ కారణంగా మత్స్యకారులు వీటిని కాపాడుకుంటారు. గాయాలపాలై తీరానికి వస్తే సపర్యలు చేసి సముద్రంలోకి తిరిగి విడిచి పెడుతుంటారు.

 

సంతానోత్పత్తి కోసం అలుపెరగని ప్రయాణం...


     అరుదైన ఈ తాబేళ్ల సంరక్షణ కోసం కొన్ని ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేస్తారు. ఇవి సముద్రం నుంచి తీరానికి వచ్చి గుడ్లు పెట్టే సమయంలో అటవీశాఖ సిబ్బంది వాటి గుడ్లను వేలాది సంఖ్యలో సేకరిస్తారు. ప్రత్యేకమైన గూళ్లు కట్టి రక్షణ వలయాలను ఏర్పాటు చేస్తారు. వీటి గుడ్లు నక్కలు, కుక్కలు ఇతర జంతువులు తినకుండా కాపాడతారు. మళ్లీ ఇవి పొదిగి పిల్లలైన తర్వాత తిరిగి సముద్రంలోకి విడిచిపెడతారు. కానీ ఎక్కువశాతం సముద్ర తీరాల్లో నేటికీ రక్షణ వలయాలు ఏర్పరచపోవడం బాధాకరమైన విషయం. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జంతుజాలంలో ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు ఒకటి. వీటిని కాపాడేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవి మన రాష్ట్రంలో ప్రస్తుతం శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి సముద్ర తీరాల్లో సందడి చేస్తున్నాయి.