ప్రజాశక్తి -పాడేరు:జగనన్నకు చెబుదాం స్పందనలో స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు, ఐటిడిఏ పిఓ వి.అభిషేక్‌తో కలిసి శుక్రవారం ఐటిడి ఏ సమావేశ మందిరంలో వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 71 ఫిర్యాదులను స్వీకరించారు. విద్యుత్ సమస్యలు, రోడ్డు నిర్మాణాలు, అంగన్వాడీ భవనాలు, అటవీ హక్కు పత్రాలు పంపిణీ, వ్యక్తిగత సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సర్వే, ఇంజనీరింగ్ విభాగాలు, వ్యవసాయ శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగాల్లో ఫిర్యాదులు అపరిషతంగా ఉన్నాయని చెప్పారు. ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు జవాబుదారీగా ఉండాలన్నారు.
స్పందనలో స్వీకరించిన ఫిర్యాదులు కొన్ని:
అటవీ హక్కు పత్రాలు మంజూరు చేయాలని పాడేరు మండలం కుజ్జలి గ్రామస్తులు కించేయి నాగమణి, పాంగి రత్నకుమారి, కిల్లో సత్యవతి వినతి పత్రం సమర్పించారు. పెదబయలు మండలం లింగేటి పంచాయతీ కేంద్రం నుండి కుంకం మామిడి గ్రామానికి రోడ్డు నిర్మించాలని పి.కొండబాబు, కె.మోహనరావు, పి.నరేష్ తదితరులు వినతి పత్రం సమర్పించారు. పాడేరు మండలం ఇరడాపల్లి పంచాయతీ డి.సంపాలు గ్రామంలో అంగన్వాడీ భవనం నిర్మించాలని సర్పంచ్ గుల్లే అశ్విజ దరఖాస్తును అందజేసారు.
జి.మాడుగుల మండలం కోడాపల్లి పంచాయతీ తోటలగొంది గ్రామానికి విద్యుత్తు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కొర్రా నూకరాజు, ఎం. చిన్నారావు వినతి పత్రం సమర్పించారు. పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీ వంతిర్భ గ్రామంలో అంగన్వాడీ భవనం నిర్మించాలని కె.బాబూరావు, పి.కామేశ్వరరావు కోరారు.పాడేరు మండలం ఇరడాపల్లి పంచాయతీ ఎస్. బొడ్డాపుట్టు గ్రామానికి బందవీధి నుండి వచ్చే విద్యుత్తు లైనును ఎగు సోలములు గ్రామం మీదగా మార్చాలని జి.లింగమూర్తి, కె.మహేష్, కె. నాగేశ్వరరావు వినతి పత్రంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి ఎం.వేంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ వి .వి.ఎస్ శర్మ, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ. కొండలరావు, పంచాయతీ రాజ్ ఇఇ టి.కొండయ్య పడాల్, డివిజనల్ పంచాయతీ అధికారి పి.ఎస్. కుమార్, సి.పి.ఓ. ఎస్ఎస్ఆర్ కె. పట్నాయక్, ఐటిడిఏ పరిపాలనాధికారి ఎం. హేమలత తదితరులు పాల్గొన్నారు