ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో, పెందుర్తి
రాష్ట్ర విభజన హామీల్లోని ఎపికి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ వంటి హామీలను మరిచి కేంద్రంలోని బిజెపి పాలన సాగిస్తోందని, మోడీ తొమ్మిదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా అన్యాయమే జరిగిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం అన్నారు. శ్రీకాకుళం జిల్లా మందసలో ప్రారంభమైన సిపిఎం ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర విజయనగరం మీదుగా శుక్రవారం సాయంత్రానికి విశాఖ జిల్లా పెందుర్తి జంక్షన్‌కు చేరుకుంది. అక్కడ ప్రజానీకం యాత్రా బృందానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో లోకనాథం మాట్లాడుతూ వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలను బిజెపి నానాటికీ తీవ్రతరం చేస్తోందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలని దేశంలో యువతను మోడీ నిలువునా ముంచాడని విమర్శించారు. బిజెపితో రాజీపడితే ఆంధ్రప్రదేశ్ ఇంకా నాశనం అయిపోతుందని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలను ఆయన హెచ్చరించారు. దేశంలోని రాష్ట్రాల హక్కులపైనా, కేటాయించాల్సిన నిధులపైనా మోడీ ప్రభుత్వం దాడి చేసి రాష్ట్రాలను అప్పుల్లో ముంచుతోందని తెలిపారు. మోడీ, అమిత్ షా కలిస్తే డబుల్ ఇంజిన్ గ్రోత్ అంటూ గొప్పలు చెప్పే బిజెపి దేశానికి ట్రబుల్ ఇంజిన్‌లా మారిందన్నారు. దేశం కోసం కాకుండా అదానీ, అంబానీల వంటి కార్పొరేట్ల కోసం మోడీ, అమిత్ షా కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. బ్యాంకులు, ఎల్‌ఐసి, ప్రభుత్వరంగ సంస్థలు, అడవులు, సముద్రతీరం, ఆకాశం.. ఇలా అన్నిటినీ అదానీ, అంబానీలకు వాటాలు వేస్తూ మోడీ అప్పజెప్పడాన్ని సిపిఎం వ్యతిరేకిస్తోందన్నారు. రాష్ట్రంలో జగన్ పాలన అయోమయంగా ఉందని, రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి కల్పించారని తెలిపారు. వైసిపి చెత్త ప్రభుత్వంలా మారిందని, ఇంటి పన్ను, యూజర్ ఛార్జీల పేర పేద, సామాన్యులపై భారాలు మోపుతోందన్నారు. విద్యుత్ బిల్లులను పెంచేసి ప్రజల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని వైసిపి, టిడిపి దొంగనాటకాలాడుతూ ప్రజా సమస్యలపై మాట్లాడటం లేదన్నారు. అసమానతలు లేని అభివృద్ధే సిపిఎం ధ్యేయమని, ఎర్రజెండాను ప్రజలు ఆదరించాలని కోరారు. సిపిఎం ప్రత్యామ్నాయ విధానాలను వివరిస్తూ రాష్ట్రంలో మూడు చోట్ల నుంచి ప్రజారక్షణ భేరి యాత్రలు సాగుతున్నాయన్నారు.
పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవి.నాగేశ్వరరావు మాట్లాడుతూ 'ప్రజలందరి అభివృద్ధే సిపిఎం విధానం. నేటి పాలకుల విధానాలతో అంబానీ, అదానీలాంటి కార్పొరేట్ల అభివృద్ధే జరుగుతుంది. దేశానికి తీవ్ర నష్టం జరుగుతోంది' అని అన్నారు. ప్రజల అకౌంట్లలోకి రూ.15 లక్షలు వేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ఎవరి అకౌంట్లలోనైనా వేశారా? అని ఆయన ప్రశ్నించగా 'లేదు.. లేదు' అంటూ జనం సమాధానమిచ్చారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ బారి నుంచి రక్షించేందుకు కార్మికులు, ఈ ప్రాంత ప్రజానీకం చేస్తున్న పోరాటం ఆదర్శవంతమైనదని తెలిపారు. ప్రైవేటీకరణను ప్రభుత్వాలు ఆపేంతవరకూ పోరాడాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర నాయకులు హరిబాబు మాట్లాడుతూ దేశంలో రైతులందరి ఆదాయాన్నీ రెట్టింపు చేస్తానని చెప్పిన మోడీ వారి నోట్లో ఎలా మట్టికొట్టారో వివరించారు. వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి మోడీ వారి ఆగ్రహానికి గురయ్యాడన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బి.ప్రభావతి మాట్లాడుతూ దేశం, రాష్ట్రంలో మహిళా హక్కులపై ప్రభుత్వాలు దాడులు చేస్తున్నాయని, నానాటికీ మహిళలపై హింస పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం జివిఎంసి 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు మాట్లాడుతూ మోడీ తొమ్మిదిన్నరేళ్ల పాలన మత విద్వేషాలతోనే సాగిందన్నారు. ఎన్నికల సందర్భంలో ఏదో ఒక కుట్ర వ్యూహం పన్నడంలో మోడీ సిద్ధహస్తుడని తెలిపారు. మాటల ద్వారా ప్రజల దృష్టిని మళ్లించేసి కార్పొరేట్లకు రూ.లక్షల కోట్లు లబ్ధి చేకూర్చే ఆర్థిక విధానాలతో ఆయన ముందుకెళ్తున్నాడని తెలిపారు. సిపిఎం పెందుర్తి జోన్ కార్యదర్శి బి.రమణి అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర నాయకులు కె.ధనలక్ష్మి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్, బి.పద్మ, బి.జగన్ తదితరులు పాల్గొన్నారు.
ఘన స్వాగతం
యాత్రా బృందానికి పెందుర్తి కూడలిలో ఘన స్వాగతం లభించింది. ప్రజలు పూలవర్షం కురిపించారు. ఆత్మీయ స్వాగతం పలికారు. చైతన్య నగర్‌లో రోడ్డు వేయాలని, భూపోరాటంలో పాల్గొన్న వారికి ఇళ్లు కేటాయించాలని, మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని పలువురు యాత్రా బృందానికి వినతిపత్రాలు సమర్పించారు. యాత్రకు స్వాగతం పలికిన వారిలో స్థానిక నాయకులు రాజు, శంకరరావు, అప్పలనాయుడు, బిటి.మూర్తి, సూర్యప్రకాష్, జై బాబు, శంకరరావు, జగన్నాథస్వామి, ఐద్వా నాయకురాలు అనంతలక్ష్మి, పలు కాలనీల వాసులు ఉన్నారు.