తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపొందించాలి
- రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
ముసాయిదా ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలని, అందుకు ఒక చెక్ లిస్టు పెట్టుకోవాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లకు సూచించారు. గురువారం విజయవాడలోని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ నాటికి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, ఓటర్ల జనాభా నిష్పత్తి, లింగ నిష్పత్తి, ఓటర్ల నమోదు, అనామలిస్ ఓటర్ల పెండింగ్, ముసాయిదా జాబితాలో ఓటర్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఎపిక్ కార్డుల ప్రింటింగ్, పంపిణీ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నంద్యాల కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, డిఆర్‌ఒ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. జాబితాలో ఒకే రకమైన ఫొటోలు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారిపోయినవి, మృతులు, ఒక ఇంటి నెంబర్‌పై 10 కంటే ఎక్కువ ఓట్లు, ఒకే వ్యక్తి పేరున రెండు మూడు అంతకన్నా ఎక్కువ ఓట్లు ఉండడం లాంటి సిమిలర్ ఓట్ల తొలగింపునకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు బాధ్యతాయుతంగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్పష్టమైన ముసాయిదా ఓటర్ల జాబితా రూపకల్పనకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ నాటి నుండి ఇప్పటి వరకు ఫారం-6 దరఖాస్తులు 20,319, ఫారం-7 దరఖాస్తులు 11,528, ఫారం-8 దరఖాస్తులు 8907 పెండింగ్‌లో వున్నాయని చెప్పారు. వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు నియోజకవర్గ ఎలక్ట్రోల్ అధికారులు, తహశీల్దారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎన్నికల పాపులేషన్ రేషియో, జెండర్ రేషియో, జంక్ క్యారెక్టర్స్, 10 కంటే ఎక్కువ ఓట్లు వుండి పెండింగ్‌లో ఉన్న వాటికి సంబంధించి ఇంటింటి సర్వేలో పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఓటర్ల జాబితాలో సవరిస్తామన్నారు. గత నెల 27వ తేదీ ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 957 ఓటర్లు అదనంగా నమోదు కాగా షిఫ్ట్, డబల్, డెత్ తదితర కారణాలవల్ల 3089 తొలగించగా, నవంబర్ 15 నాటికి జిల్లాలో 13,56,152 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. రాజకీయ పార్టీలతో తరచుగా సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభ్యర్థనలు అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. మీడియాలో వచ్చే వార్తలపై కూడా దృష్టి సారించి వాస్తవాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ముఖ్యంగా 18, 19 సంవత్సరాల యువ ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నంద్యాల, ఆత్మకూరు, డోన్ ఆర్డీవోలు శ్రీనివాసులు, ఎం.దాసు, వెంకటరెడ్డి, ఎన్నికల విభాగపు అధికారులు తదితరులు పాల్గొన్నారు.