* ఇద్దరు మృతి, 27 మందికి గాయాలు
* ఇద్దరి పరిస్థితి విషమం
* మందస మీదుగా ఒడిశా వెళ్తున్న వాహనానికి ప్రమాదం
* బిజెపి సభకు హాజరయ్యేందుకు వెళ్తున్న బాధితులు
ప్రజాశక్తి - మందస, పలాస: మందస మండలం గౌడు గురంటి సమీపం వద్ద మంగళవారం ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కుసుమాలకు చెందిన బుయ జగన్నాథ్ (50), అబుతొడికి చెందిన సవర డేరా (60) అక్కడికక్కడే మృతి చెందారు. 27 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఒడిశా, ఆంధ్రా పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, క్షతగాత్రులు తెలిపిన వివరాల మేరకు ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా చీకటికోటలో నిర్వహించే బిజెపి బహిరంగ సభకు అదే జిల్లా గుడ్డిభద్రకు చెందిన బిజెపి నాయకుడు సవర కుడుము... కుసుమాల, డబాతోలి, గుడ్డిపొదర్, పత్రసాయి, వంబాడియా గ్రామాలకు చెందిన సుమారు 30 మంది మహిళలు, పురుషులను ట్రాక్టర్లో తీసుకెళ్లాడు. మందస మండలం మీదుగా చీకటికోటకు వెళ్లాల్సి ఉండగా, గౌడు గురంటి గెడ్డ సమీపానికి వచ్చేసరికి ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో సవర డేరా, బుయ జగన్నాథ్ అక్కడికక్కడే మతి చెందారు. 27 మందికి గాయాలయ్యాయి. ఘటనా సమాచారం తెలుసుకున్న మందస పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. క్షతగాత్రులను 108లో మందస మండలం హరిపురం సిహెచ్‌సికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరు
ప్రమాద సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో తాము ఎలా బతికేదంటూ రోదిస్తున్నారు. ప్రమాదం సమాచారం తెలుసుకున్న ఒడిశా రాష్ట్రం జరడా పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జి ఇన్స్పెక్టర్ సాసుమాను హరిపురం సిహెచ్‌సికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసినట్లు మందస ఎస్ఐ హరికృష్ణ తెలిపారు.