అనగనగా రామాపురం అనే ఊరిలో ముగ్గురు రైతులు ఉండేవారు. వాళ్ళ పేరు రాము, రాజు, శేఖర్. వారు చాలా మంచి స్నేహితులు. వారు వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా జీవించేవారు.
ఆ ముగ్గురు రైతులు కలిసి ఒక పొలంలో మొక్కజొన్న పంటను వేశారు. పంట చాలా బాగా పండింది. ఒకరోజు మొక్కజొన్నలు కోసి, బజారులో అమ్మారు. వచ్చిన ఆదాయాన్ని ముగ్గురూ సమంగా పంచుకున్నారు. పంచుకున్న డబ్బును వాళ్ళ భార్యలకు ఇచ్చి, జాగ్రత్తగా ఉంచమని చెబుతారు.
కానీ రాము భార్య వచ్చిన డబ్బుతో నగలు, చీరలు కొనుక్కుంది. అది చూసి మిగిలిన వారి భార్యలు తమకు ఇచ్చిన డబ్బులతో కూడా నగలు, చీరలు కొనుక్కున్నారు. చీరలు, నగలు చూసిన ముగ్గురు రైతులు ఆశ్చర్యపోతారు. 'ఇవన్నీ ఎలా కొన్నారు?' అని అడుగుతారు. 'మీరు ఇచ్చిన డబ్బులతోనే మేము ఇవన్నీ కొన్నాము' అని వారు సమాధానం చెప్పారు.
'మేము కష్టపడి సంపాదించిన డబ్బును మీరు వృథాగా ఖర్చు పెట్టారు' అని కోపంగా వెళ్ళిపోతారు.
'మనం చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు మన భర్తలతో కలిసి మొక్కజొన్నలను అమ్ముదాం!' అని ముగ్గురు మహిళలూ నిర్ణయించుకుంటారు.
తర్వాత రోజు నుంచి వారు తమ భర్తలతో కలిసి మొక్కజొన్న కంకుల్ని కాల్చి, అమ్మి నెలరోజులలో చాలా డబ్బును సంపాదిస్తారు. ఆ సంపాదించిన డబ్బును వారి భర్తలకు ఇచ్చి, 'మమ్మల్ని క్షమించండి!' అని అడుగుతారు.
'డబ్బులను అనవసరంగా ఖర్చు చేయకూడదనే అలా అన్నాం!' అని ముగ్గురు రైతులు అంటారు.
తర్వాత రోజు నుంచి అందరూ కలిసి పనిచేసి, సుఖంగా బతికారు.
- కె. వెంకట మణి తేజరెడ్డి
10వ తరగతి (ఎ1),
విజరు ఉన్నత పాఠశాల, నిజామాబాద్, తెలంగాణ.