ప్రజాశక్తి-రాజోలు నిత్యం రద్దీగా ఉండే వాణిజ్య కూడళ్లు అవి.. స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వివిధ పనులపై భారీగా జనాభా అక్కడకు వస్తారు.. మిగతా సౌకర్యాలు బాగానే ఉన్నా.. వివిధ పనులపై వచ్చేవారికి మూత్ర విసర్జనకు ఎలాంటి సౌకర్యం లేని పరిస్థితి.. సామూహిక మరుగుదొడ్లను నిర్మించాలని ఎప్పటి నుంచో కోరుతున్నా.. పట్టించుకునే వారు కరవయ్యారు.. ఇప్పటికైనా ఈ దిశగా స్థానిక సంస్థలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వాణిజ్య కూడళ్లు.. మర్కెట్లలో ఎంతసేపైనా తిరగండి మీ ఇష్టం.. కనీస సౌకర్యాలు కల్పించే విషయం మాత్రం పట్టించుకోవాల్సిన పని లేదన్నట్లుగా అయా పంచాయతీలు వ్యవహరిస్తున్నాయి. వాణిజ్య కూడళ్లలో ప్రజా మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రజలు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
రాజోలు నియోజక వర్గంలోని రాజోలు, మలికిపురం, తాటిపాక ముఖ్యమైన వాణిజ్య కూడళ్లు. ఇక్కడ ప్రజలకు అవసరమైన ఏ వస్తువైనా దొరుకుతుంది. అంతేగాక సినిమా హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్ లు, ఆసుపత్రులు ఈ ప్రదేశాల్లో ఉండడంతో పరిసర ప్రాంతాల ప్రజలు వివిధ పనులపై తెల్లారితే ఈ ప్రాంతాలకు వస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చక్కబెట్టుకుని పొద్దుపోయాక ఇంటికి చేరుకుంటారు. ఈ సమయంలో కనీసం మూత్ర విసర్జనకు ఎలాంటి సౌకర్యం లేక అత్యవసర సమయాల్లో ఆరుబయట కానిచ్చేస్తుండడంతో పరిసరాలు దుర్వాసన వస్తున్నాయి. ఈ పరిస్థితిలో వ్యాధులు సైతం ప్రబలే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో 2,42,224 మంది జనాభా
ఉన్నారు. వీరంతా ఎప్పుడోకప్పుడు వ్యాపార, వాణిజ్య అవసరాల నిమిత్తం గుకాణాలకు వైద్యసేవలు నిమిత్తం ఆసుపత్రులకు, ప్రభుత్వ పనులపై ఆయా కార్యాలయాలకు రాజోలు, మలికిపురం, తాటిపాకలోని కూడళ్లకు వస్తుంటారు. ఈ ప్రాంతంలో ప్రజా మరుగుదొడ్లు లేకపోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక అవస్థలు పడుతున్నారు. మహిళలైతే మరీ ఇబ్బంది పడుతున్నారు.
విద్యార్థినులకు తప్పని అవస్థలు
మలికిపురం, తాటిపాక కూడళ్లు వ్యాపార రంగానికి పెట్టిన పేరు ఇక్కడ వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం నిత్యం మండలంలోని ప్రజలతో పాటు ఇతర మండలాల నుంచి తరలి వస్తుంటారు.వివిధ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు తప్ప బయటివారికి మరుగుదొడ్ల సౌకర్యాలు లేవు. వివిధ గ్రామాల నుంచి బ్యాంకులోకి డ్వాక్రా సంఘ సభ్యులు, ప్రభుత్వ కళాశాలలకు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇలా వచ్చిన వారు బస్సుల కోసం ఇతర వాహనాల కోసం గంటల తరబడి ప్రయాణ ప్రాంగణాల్లో నిరీక్షిస్తుంటారు. ఆ సమయంలో కనీస అవసరాలు తీర్చేందుకు నేటికీ వసతులు లేక పంటి బిగువున భరిస్తున్నారు.