Nov 19,2023 22:41

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న వైసిపి ప్రభుత్వానికి రాబోవు ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ సత్తాను చాటి ఓడించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. నగరంలోని హోటల్‌ జగదీశ్వరిలో ఆదివారం స్థానిక ప్రభుత్వాల సాధికారతపై జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పిసిసి మీడియా కమిటీ ఛైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డి మాట్లాడుతూ ఐదు వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్న గ్రామీణ పంచాయతీ వ్యవస్థను నేటి వైసిపి ప్రభుత్వం నిర్జీవం చేసిందని ఆరోపించారు. పంచాయతీ సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారన్నారు. ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికైన సర్పంచులకు నిధులు, విధులు, అధికారాలు కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి స్థానిక సంస్థల హక్కులను హరించే విధానాలను అమలు చేస్తున్నాయని అన్నారు. ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంతో అనేక పంచాయతీలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మధు మాట్లాడుతూ పంచాయతీల కనీస బాధ్యతలైన తాగునీరు సరఫరా, పారిశుధ్య నిర్వహణ వంటి కార్యక్రమాలు సైతం నిర్వహించలేని దుస్థితిలోకి పంచాయితీలను వైసిపి ప్రభుత్వం నెట్టివేసిందని దుయ్యబట్టారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ సర్పంచులకు సచివాలయాల్లో స్థానం లేదని, వాలంటీర్లు వైసిపి కార్యకర్తలుగా వ్యవహరించడం వలన స్థానిక సంస్థల ప్రతినిధులకు విలువ లేకుండా పోతుందన్నారు. సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిలకలపూడి పాపారావు మాట్లాడుతూ గ్రీన్‌ అంబాసిడర్ల జీతాలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం మానివేసి పంచాయతీలపై భారం మోపుతుందన్నారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య భావాలను, పౌర హక్కులను కాలరాస్తూ పరిపాలించడం శోచనీయమన్నారు.