Nov 19,2023 22:31

ప్రజాశక్తి - కోరుకొండ విద్యా రంగంలో నెలకున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. మండలంలోని బూరుగుపూడి వద్ద గల ద్వారకామయి కళ్యాణ మండపంలో ఆదివారం యుటిఎఫ్‌ జిల్లా కౌన్సిల్‌ సమావేశం జరిగింది. తొలుతగా జాతీయ పతాకాన్ని, ఎస్‌టిఎఫ్‌ఐ, యుటిఎఫ్‌ పతాకాలను నాయకులు ఆవిష్కరించారు. అనంతరం యుటిఎఫ్‌ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభ యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జి మాట్లాడుతూ కేడర్లకు, కుల, మతాలకు అతీతంగా యుటిఎఫ్‌ 50 ఏళ్లుగా నిలబడి, ఎన్నో అటు పోట్లను తట్టుకుందంటే దానికి కారణం యుటిఎఫ్‌ కార్యకర్తలు, నాయకత్వం యొక్క నిబద్ధతే అని అన్నారు. యుటిఎఫ్‌ నినాదాలైన అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహలను యుటిఎఫ్‌ కార్యకర్తలు ఆకలింపు చేసుకోవాలని సూచించారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎంఎల్‌సి ఐ. వెంకటేశ్వరరావు(ఐవి) మాట్లాడుతూ నాడు-నేడు ద్వారా పాఠశాలల మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపరచడాన్ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. కానీ ఒకసారి రాష్ట్ర సిలబస్‌, తదుపరి సిబిఎస్‌ఇ, ఆ తరువాత ఐబి సిలబస్‌ అని చెబుతూ ఉపాధ్యాయులను గందరగోళంలో నెట్టిందని తెలిపారు. విద్యార్థులు ప్రాథమిక సామర్థ్యాలు సాధించడంలో వెనుకబాటు పడడానికి వైసిపి ప్రభుత్వ విధానాలే కారణమని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల డ్రాప్‌ అవుట్లు పెరిగిపోయారని ఆయన విమర్శించారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమ్మ ఒడి, నాడు-నేడు, జగనన్న గోరుముద్ద వంటి పథకాలతో వేలకోట్లు విద్య రంగానికి ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికే ఉపయోగపడిందని, ఆయా పథకాల వల్ల విద్యార్థులకు ఎటువంటి మేలు జరగలేదని విమర్శంచారు. ఉపాధ్యాయుడికి స్వేచ్ఛ లేని విద్యా విధానాన్ని రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు..ఉపాధ్యాయ నియామకాలు లేకుండా విద్యారంగాన్ని ఎలా అభివృద్ధి పథంలో తీసుకువెళతారో ప్రభుత్వమే చెప్పాలన్నారు. విద్యారంగానికి ఖర్చు పెడుతున్న నిధులలో పారదర్శకత కొరబడిందని, విద్యారంగ ప్రణాళికలను ఉపాధ్యాయులతో, మేధావులతో, ఎంఎల్‌సిలతో చర్చించకుండా ఏకపక్షంగా అమలు చేస్తున్నారని అందుకే విద్యా ప్రమాణాలు తిరుగమనంలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యారంగ స్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఊరిబడికి ఉరివేసిందని, గ్రామాల్లో ప్రాథమిక పాఠశాల లేకుండా చేసిన ఈ ప్రభుత్వ తీరును ప్రజలు గ్రహించాలని సూచించారు. 4576 పాఠశాలలను 3, 4, 5 తరగతుల విలీనం పేరుతో ఉన్నత పాఠశాలలో కలిపిందని, ఫలితంగా 14వేలకు పైగా పాఠశాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయని తెలిపారు. ఉపాధ్యాయులను భయపెట్టే విధంగా అధికారులను ప్రోత్సహించడం సరికాదన్నారు. ఉపాధ్యాయునికి, విద్యార్థికి స్వేచ్ఛ లేని వ్యవస్థ మంచి విద్యా ఫలితాలను ఇవ్వదన్నారు. ప్రతి సంవత్సరం మెగా డిఎస్‌సి వేస్తామని మేనిఫెస్టోలో చెప్పి అసలు డిఎస్‌సి లేకుండా చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానికే చెల్లిందన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడం మాని తక్షణమే డిఎస్‌సి వేసి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను అధిగమించాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్‌ మాట్లాడుతూ కేవలం పోరాటాల ద్వారా మాత్రమే సమస్యలు సాధించగలమని, ఎంతటి మొండి ప్రభుత్వాలనైనా ప్రజా ఉద్యమాల ద్వారా గద్దె దించవచ్చన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, పెన్షనర్లు ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములు కావడం ద్వారానే సమస్యలను పరిష్కరించికోగల్గుతామని, అందుకు ప్రతీ ఒక్కరూ సమస్యల పరిష్కారానికి పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. రాజానగరం ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను తీర్చడంలో యుటిఎఫ్‌ అగ్రభాగాన ఉందని, అలాగే ఇతర రంగాల్లోనూ ముందుండాలని సూచించారు. నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆ కృషి ఫలించాలంటే ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి బాసటగా నిలవాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి ఎన్‌. అరుణకుమారి మాట్లాడుతూ యుటిఎఫ్‌ 50 ఏళ్ల స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటుందని, రాష్ట్రంలో లక్షపై చిలుకు సభ్యత్వాన్ని కలిగిన ఏకైక ఉపాధ్యాయ సంఘంగా నిలబడిందని అన్నారు. పిడిఎఫ్‌ ఎంఎల్‌సిల గెలుపు యుటిఎఫ్‌ నిర్మాణం ద్వారానే సాధ్యమైందన్నారు. వారం రోజుల్లో సిపిఎస్‌ను రద్దు చేస్తామని ప్రకటించిన సిఎం జగన్మోహన్‌ రెడ్డి మాట నిలబెట్టుకోలేకపోయారన్నారు. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాల పెరిగిపోయాయని, ప్రభుత్వ పాఠశాలలో నమోదు పడిపోయిందని, వీటన్నింటికీ ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన విధానాలే కారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బివి.రాఘవులు, అల్లూరి సీతారామరాజు జిల్లా కోశాధికారి కృష్ణ, పూర్వపు రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర వర్మ, కాకినాడ జిల్లా అధ్యక్షులు కెవివి.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి టి.రవి చక్రవర్తి, సహ అధ్యక్షురాలు వినాగమణి మాట్లాడారు. అనంతరం యుటిఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి ఎ.షరీఫ్‌, కార్యదర్శులు ప్రవేశపెట్టిన నివేదికలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
నూతన కమిటీ ఏకగ్రీవం
తూర్పు గోదావరి జిల్లా యుటిఎఫ్‌ నూతన జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షులుగా పి .జయకర్‌, ప్రధాన కార్యదర్శిగా ఎ.షరీఫ్‌, గౌరవ అధ్యక్షులుగా వి.శంకరుడు, సహధ్యక్షులుగా ఐ.రాంబాబు సహధ్యక్షురాలుగా ఎం.విజయ గౌరి, కోశాధికారి ఇవిఎస్‌ఆర్‌.ప్రసాద్‌, కార్యదర్శులుగా జివి.వెంకటరమణ, ఎన్‌. రవిబాబు, రమేష్‌ బాబు, మనోహర్‌ కుమార్‌, డి.మనోజ్‌ కుమార్‌, కె.నాగభూషణం, ఎన్‌.భవాని, పి శ్రీనివాసమూర్తి ఎన్నికయ్యారు.