Nov 08,2023 23:41

బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

ప్రజాశక్తి -గాజువాక : విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెరగాలని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. జిల్లా విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆధ్వర్యాన 31వ జాతీయ బాలల సైన్సు కాంగ్రెస్‌ - 2023 జిల్లా స్థాయి పోటీలను గాజువాక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి 273 ప్రాజెక్టులు వచ్చాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవానికి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గెలుపు, ఓటములతో నిమిత్తం లేకుండా ఈ పోటీలలో పాల్గొనడం వల్ల విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనలు, అభిరుచులు కలుగుతాయన్నారు. విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికితీయడానికి ఇటువంటి పోటీలు మంచి వేదికలన్నారు.
డిఇఒ ఎల్‌.చంద్రకళ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తిని పెంచుకోవాలన్నారు. సైన్సులో వస్తున్న మార్పులను, నూతన ఆవిష్కరణలను గమనిస్తూ తదనుగుణంగా విద్యార్థులు తమనుతాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు. సర్వశిక్షా అభియాన్‌ అడిషనల్‌ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, విద్యార్థులు మంచి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఇటువంటి పోటీలు దోహదం చేస్తాయన్నారు. జిల్లా కో-ఆర్డినేటర్‌ పి.రాజారావు మాట్లాడుతూ, వచ్చిన ప్రాజెక్ట్‌లలో అత్యుత్తమైన ఏడింటిని ఎంపిక చేసామని, వాటిని ఈ నెల 29, 30 తేదీలలో విజయవాడలోని కెఎల్‌.యూనివర్సిటీలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ జి.సునీత, డిసిఎంఎస్‌ మాజీ చైర్‌ పర్సన్‌ పి.చినతల్లి, పాఠశాల విద్యా కమిటీ చైర్‌పర్సన్‌ లకీëబాయి తదితరులు పాల్గొన్నారు.