ప్రజాశక్తి -గాజువాక : వైజాగ్‌ను రాజధాని చేయడం అంటే విశాఖ అభివృద్ధేనని, అది చంద్రబాబుకు ఇష్టం లేదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. వైసిపి సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా సోమవారం పాత గాజువాకలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు వ్యాపారాలు మాత్రం విశాఖలో జరగాలి కానీ రాజధాని మాత్రం వద్ద అంటారని ఎద్దేవాచేశారు. హైదరాబాద్‌లో నివాసముండి ఆంధ్రాలో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న పథకాలు చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగున్నర సంవత్సరాలుగా స్వచ్ఛమైన పాలన ప్రజలకు అందుతుందన్నారు. ఒక్క అవినీతిపై కూడా చంద్రబాబు మాట్లాడడానికి అవకాశం లేకుండా ఉందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే విద్య, ఆరోగ్యం, గృహ సదుపాయం ఉండాలనే ఉద్దేశంతో వాటిని ముఖ్యమంత్రి అమలు చేశారన్నారు. గాజువాకలో త్వరలో గురుకుల పాఠశాల ఏర్పాటు కానున్నట్లు తెలిపారు.
పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ, గాజువాకలో 20 వేల మంది మత్స్యకారులు ఉన్నారని, వారికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఏమి చేశారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో కూర్మన్నపాలెంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వైసిపిపై పోరాటం చేస్తామని డెడ్‌లైన్ విధించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందన్న విషయం కూడా తెలియదని ఎద్దేవాచేశారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్‌నాథ్, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, వైసిపి జిల్లా అధ్యక్షులు కోలా గురువులు తదితరులు పాల్గొన్నారు.
ఖాళీ అయిన కుర్చీలు..
మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగం ముగిసిన వెంటనే చాలామంది మహిళలు సభా ప్రాంగణం నుంచి నిష్క్రమించారు. సభ ముగిసే సమయానికి కిలోమీటర్ వరకు కుర్చీలు ఖాళీగా కనిపించాయి.