- ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాధ్ ఇటీవల వెలువరించిన
- 'ఆఖరి యోధులు' పుస్తకంలోంచి తీసుకున్న ఇంటర్వూ ్య సంక్షిప్త రూపం ఇది.
- సిపిఎం తమిళనాడు రాష్ట్ర మాజీ కార్యదర్శి, స్వాతంత్య్ర సమరయోధుడు, నిష్కళంక దేశభక్తుడు ఎన్.శంకరయ్య - దేశ వామపక్ష ఉద్యమంలో ఒక అరుణతార. 1947 ఆగస్టు 14న బ్రిటిష్ జైళ్ల నుంచి బయటికి వచ్చిన వారిలో ఆయన ఒకరు. ఆ రోజు మదురై జైలు నుంచి బయటికి వచ్చీ రాగానే- స్వాతంత్య్ర విజయోత్సవ ప్రదర్శనలో కలిసిపోయిన నవ యువకుడు.
శంకరయ్యను 2019లో కలిశాను. చాలా చురుగ్గా ఉన్నారు. ఆయనలోని మేధాశక్తి ఎక్కడా చెక్కు చెదరలేదు. అప్పటికీ బయటకు వెళ్లి ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు. ఆయనతో నా ఇంటర్వ్యూ దాదాపు గంటన్నర పాటు సాగింది. కమ్యూనిస్టుల అంకితభావానికి, దృఢసంకల్పానికి ఆయన మాటలు అద్దం పడతాయి.
''భగత్‌సింగ్‌కి ఉరిశిక్ష విధించిన రోజు రాష్ట్రం మొత్తం అట్టుడిగిపోయింది. వేలాదిమంది జనం రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలు చేపట్టారు. కొంత మంది గట్టిగా ఏడ్చేశారు. ఆరోజు జరిగిన ప్రదర్శన ల్లో నేను పాల్గొన్నాను. అప్పుడు నా వయసు తొమ్మిదేళ్లు.''
''కాలేజీ రోజుల్లో నాకు వామపక్ష భావాలు గల వారితో స్నేహం కుదిరింది. స్వాతంత్య్రం రాకుండా సామాజిక సంస్కరణ జరగదని గ్రహించాను. 17 ఏళ్ల వయస్సులో భారత కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడినయ్యాను. ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉంది. పార్టీ అజ్ఞాతంగా పని చేసేది''.
''అన్నామలై యూనివర్సిటీలో బ్రిటిష్ వ్యతిరేక నిరసనలో పాల్గొన్న విద్యార్థి అరెస్టును నిరసిస్తూ మధురైలో ఒక సభ జరిగింది. మేము ఆ సందర్భంగా ఒక కరపత్రం విడుదల చేశాం. దాంతో మా అమెరికన్ కళాశాల హాస్టలుపై పోలీసులు దాడి చేశారు. ఆ కరపత్రం ఉన్నందుకు నారాయణ స్వామి అనే మిత్రుడిని అరెస్టు చేశారు. ఆ అరెస్టును కూడా ఖండిస్తూ మేమొక నిరసన ప్రదర్శన చేశాం.''
''ఫైనల్ పరీక్షలకు సరిగ్గా 15 రోజుల ముందు - 1941 ఫిబ్రవరి 28న బ్రిటిష్ పోలీసులు నన్ను అరెస్టు చేశారు. ఆపై నేను తిరిగి కళాశాలకు వెళ్లలేదు. నా బిఏ కోర్సు పూర్తి చేయలేదు. నేను దేశ స్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్లినందుకు గర్వపడ్తు న్నాను'' ''నా బుర్రలో స్వాతంత్య్ర సముపార్జన భావన మాత్రమే నాటుకు పోయింది. భవిష్యత్ పాడవుతుందేమో అన్న బెంగ ఎప్పుడూ లేదు. ఆ సమయంలో రాడికల్ విద్యార్థుల లక్ష్యం ఒక్కటే! అదే స్వాతంత్య్ర సముపార్జన. మేము ఉద్యోగాల వేటలో లేము. స్వాతంత్య్ర వేటలో ఉన్నాం.''
''మధురై జైల్లో 15 రోజులు ఉంచాక నన్ను వెల్లూరు జైలుకు పంపారు. ఆ సమయంలో తమిళనాడు, ఆంధ్ర, కేరళల నుంచి చాలా మందిని ఆ జైలులో నిర్బంధించారు. వారిలో కేరళ కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రసిద్ధ నాయకుడు కా||ఎ.కె.గోపాలన్, మరో నాయకుడు కా||ఇంబిచ్చి బవ, వి.సుబ్బయ్య, జీవానందం తదితరులు ఉన్నారు. మద్రాసు ప్రభుత్వం మమ్మల్ని రెండు బృందాలుగా విడదీసింది. ఒక గ్రూపుకు 'సి' కేటగిరి భత్యం ఇచ్చేవారు. అది నేరం చేసి శిక్ష పడిన వారి కేటగిరి. ఆ పద్ధతికి వ్యతిరేకంగా మేం 19 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాం. ఆ జైల్లోనే ప్రత్యేక సెల్లులో కామరాజార్ (కె.కామరాజ్) కూడా ఉండేవారు. ఆ తర్వాత ఆయన మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. నిరాహర దీక్షలో కాంగ్రెస్ పాల్గొనలేదు. ''మేము గాంధీ సలహాకు కట్టుబడి ఉన్నాం. జైల్లో ఎలాంటి ఆందోళనలూ చేపట్టం.'' అని వారు చెప్పేవారు.
వివిధ అంశాలపై గట్టి విభేదాలు ఉన్నా కామరాజార్ కమ్యూనిస్టులకు మంచి మిత్రుడు. ఆయనతో పాటు ఆ సెల్లులో మద్రాసు, తిరునల్వేలి లకు చెందిన కమ్యూనిస్టులు ఉండేవారు. జైల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య పెద్ద పెద్ద వాదనలు చాలా జరిగేవి. కొద్ది రోజుల తర్వాత మాలో ఎనమండుగురిని రాజమండ్రి జైలుకు మార్చారు. ఏప్రిల్ 1942లో జైలు నుంచి విద్యార్థులందరినీ విడిచి పెట్టారు, నన్ను తప్ప. నెల రోజుల పాటు ఒంటరి శిక్ష అనుభవించాను. ఆ సమయంలో చాలా పుస్తకాలు చదివాను.''
''కామరాజ్ ఒకసారి కొల్‌కత్తా నుండి తిరిగి వస్తున్నప్పుడు రాజమండ్రి స్టేషన్లో ఆగారు. రాజమండ్రి జైలు నుంచి విడుదలైన నా మిత్రులంతా వెళ్లి కలిసి, శంకరయ్య ఇంకా విడుదల కాలేదని తెలిపారు. ఆయన మద్రాసు చీఫ్ సెక్రెటరీకి ఒక లేఖ రాస్తూ- నన్ను వెల్లూరు జైలుకు మార్చాలని కోరారు. వెల్లూరులో నేను 200 మంది సహచరుల మధ్య ఉండేవాణ్ణి. ఇలా 1947కి ముందూ, ఆ తరువాత నేను ఇలా చాలా జైళ్లకు తిరిగాను. 1943లో ఒకచోట మాజీ దేశాధ్యక్షుడు ఆర్.వెంకట్రామన్‌ను కలిశాను. ఆయన అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడే. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. మేమిద్దరం కలిసి చాలా ఏళ్ల పాటు పనిచేశాం.''
1948లో కమ్యూనిస్టు పార్టీని నిషేధించి నప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లాను. 1950లో అరెస్టు చేసి ఏడాది తర్వాత విడుదల చేశారు. ఇండియా- చైనా యుద్ధం సందర్భంగా జరిగిన అరెస్టులో ఏడు నెలల పాటు జైల్లో ఉంచారు. 1965లో ప్రభుత్వం మరోసారి కమ్యూనిస్టులపై విరుచుక పడింది. ఆ సమయంలో మరో 17 నెలలు జైల్లో నిర్బంధించారు.''
''తంజావూర్ జైలు నుంచి 1944లో నేను విడుదలయ్యాను. కమ్యూనిస్టు పార్టీ మధురై జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యాను. తర్వాత 22 ఏళ్ల పాటు కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాను.''
''1940 దశకం మధ్యలోకి వచ్చే నాటికి మధురై వామపక్ష ఉద్యమానికి ఒక కీలక కేంద్రమయింది. 1946లో పిసి జోషి మధురై వచ్చినప్పుడు జరిగిన సభకు లక్షమంది హాజరయ్యారు. కమ్యూనిస్టులకు ప్రజాదరణ పెరిగి పోతుండటంతో బ్రిటిష్ పాలకులు కమ్యూనిస్టులపై మధురై కుట్ర కేసును బనాయిం చారు. పి.రామమూర్తి అందులో మొదటి ముద్దాయి. నేను రెండవ ముద్దాయిని. మాతో పాటు అనేక మంది కమ్యూనిస్టు నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులను హత్య చేయడానికి కుట్ర చేస్తున్నా మనేది మాపై అభియోగం. బండిలాగే ఒకడిని పోలీసులు ముఖ్య సాక్షిగా పెట్టుకొన్నారు. మేము ఆఫీసులో కూచొని కుట్ర చేస్తుంటే అతడు విన్నాడని కట్టుకథ అల్లారు. పి.రామమూర్తి తన కేసును తనే వాదించి, ఆ బండివాడు ఒక మోసగాడని, చిన్నపాటి దొంగ అని, అనేకసార్లు జైలుశిక్షలు అనుభవించాడని క్రాస్ ఎగ్జామినేషన్‌లో రుజువు చేశారు. ఆ కేసును విన్న ప్రత్యేక జడ్జి ఆగస్టు 14, 1947న సెంట్రల్ జైలుకు వచ్చి, మమ్మల్ని నిర్దోషులుగా విడుదల చేశారు. తప్పుడు కేసు బనాయించినందుకు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
1952 ఎన్నికల్లో రామమూర్తి ఉత్తర మధురై నియోజక వర్గంలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా నిలబడ్డారు. నేను ఎన్నికల ప్రచార బాధ్యుడిని. ఆయన జైల్లో ఉండగానే ఫలితాలు వెలువడ్డాయి. మంచి మెజారిటితో గెలిచారు. మూడు లక్షల మందితో విజయోత్సవ సభ జరిగింది. స్వాతంత్య్రం తర్వాత ఏర్పడిన మొదటి మద్రాసు శాసనసభలో రామమూర్తి ప్రతిపక్ష నాయకుడయ్యారు.''
''1964లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక సంభ వించినప్పుడు నేను సిపిఎం వైపు ఉన్నాను. ఆ రోజు సిపిఐ జాతీయ కౌన్సిల్ సమావేశం నుంచి వాకౌట్ చేసిన వారిలో నేను, కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్. అచ్యుతానందన్ మాత్రమే ఈరోజు జీవించి ఉన్నాం''
కార్మికుల, రైతుల పట్ల శంకరయ్యలోని అంకితభావం చెక్కుచెదర లేదు. ఎన్నికల రాజకీయాలకు కమ్యూనిస్టులు ఒకనాడు సరైన సమాధానాలు కనుక్కొంటారనే విశ్వాసం ఆయన మాటల్లో వ్యక్తమైంది. వారు పెద్దఎత్తున ప్రజా ఉద్యమాలను నిర్మించగలరని ఆయన అన్నారు. 99 ఏళ్ల కా.శంకరయ్య ... ఇంటర్వ్యూ ప్రారంభంలో ఎంత శక్తితో, ఎంత అభిరుచితో ఉన్నారో- ఇంటర్వ్యూ ముగిసినప్పుడు కూడా ఆయన అదే శక్తి, అదే అభిరుచితో ఉన్నారు. భగత్‌సింగ్ త్యాగంతో తొమ్మిదేళ్ల వయస్సులో ఎంత ఉత్తేజితుడయ్యారో 99 ఏళ్ల వయస్సులోనూ ఆయన అదే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.
- ప్రజాపక్ష మేధావి .. నిస్వార్థ నేత ...
శంకరయ్యతో మా మొదటి ఇంటర్వ్యూ ను పీపుల్స్ అర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (పరి)లో 2020 జులై 20న పోస్టు చేశాం. ఆ తర్వాత ఏడాది లోపల తమిళనాడు ప్రజలు ఎం.కె.స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకె ప్రభుత్వాన్ని ఎన్నుకొన్నారు. ఆ ప్రభుత్వం తొలి పనుల్లో ఒకటి తగైసాల్ తమిజార్ అవార్డును నెలకొల్పడం. రాష్ట్రస్థాయి లో అదే అత్యున్నత అవార్డు. తమిళనాడుకు, తమిళ ప్రజలకు అత్యుత్తమ సేవలందించిన విశిష్ట వ్యక్తికి ఇచ్చే అవార్డు అది. ఆ అవార్డును మొట్టమొదట అందుకొన్నది శంకరయ్య. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ క్రోంపేట్‌లోని శంకరయ్య ఇంటికి వచ్చి ఆ అవార్డును అందచేశారు. అప్పటికి వంద సంవత్సరాల వయసుకు చేరనున్న శంకరయ్య అవార్డును అంగీకరించారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అవార్డుతో ఇచ్చే రు.10 లక్షల నగదును తీసుకోవడానికి నిరాకరించారు. ఆ డబ్బును కోవిడ్ బాధితుల కోసం ఖర్చు చేయమని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఆయన 1972లో స్వాతంత్య్ర సమర యోధుల పెన్షన్ తీసుకోవడానికి కూడా నిరాకరించారు. ''మేము స్వాతంత్య్రం కోసం పోరాడాం. పింఛన్ కోసం కాదు'' అని ఒకసారి చెప్పారు.
అమెరికన్ క్రిష్టియన్ కళాశాల అత్యుత్తమ విద్యార్థుల్లో ఆయన ఒకరు. ఆయన దగ్గర డిగ్రీ లేదంటే అందుకు కారణం ఫైనల్ పరీక్షలకు కొద్దిగా ముందు ఆయన దేశం కోసం జైలు వెళ్లడమే! ఆయనకు గౌరవ డిగ్రీ ఇవ్వాలని మధురై విశ్వవిద్యాలయం కొంతకాలం క్రితం నిర్ణయించింది. కానీ, ఆ ఫైలును బిజెపికి తోలుబొమ్మలా వ్యవహరిస్తున్న రాష్ట్ర గవర్నరు తన వద్దే తొక్కి పెట్టి ఉంచుకున్నారు. కమ్యూని స్టుల పట్ల కాషాయ నేతలకున్న విద్వేష భావానికి అదొక ఉదాహరణగా నిలుస్తుంది. ప్రజాపక్ష మేధావి శంకరయ్య గౌరవం, విజ్ఞానం ఆ డిగ్రీ కన్నా కొన్ని లక్షల రెట్ల ఎత్తులో ఉన్నాయి.