- శంకరయ్య మృతికి పొలిట్‌బ్యూరో సంతాపం
న్యూఢిల్లీ : కమ్యూనిస్టు యోధుడు , పాత తరం కమ్యూనిస్టు నేతల్లో ఒకరైన కామ్రేడ్ ఎన్.శంకరయ్య (102) మృతి పట్ల పార్టీ పొలిట్‌బ్యూరో ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేసింది. పార్టీ పొలిట్‌బ్యూరో బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. మదురైలోని అమెరికన్ కాలేజీ విద్యార్ధిగా ఉండగానే శంకరయ్య స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అయితే పరీక్షల ముందు ఆయన అరెస్టు కావడంతో డిగ్రీ పొందలేకపోయారు. 1940లో ఆయన కమ్యూనిస్టు పార్లీఓ చేరి, తమిళనాడు ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించారని పొలిట్‌బ్యూరో కొనియాడింది. స్వాతంత్య్రం వచ్చేవరకు ఆయన మొత్తంగా 8ఏళ్ళు జైలు శిక్ష అనుభవించారని పొలిట్‌బ్యూరో పేర్కొంది. పార్టీ జాతీయ కౌన్సిల్ నుండి బయటకు వచ్చేసి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్)ను ఏర్పాటు చేసిన 32మంది సభ్యుల్లో శంకరయ్య ఒకరు. తమిళనాడులో ఐక్య పార్టీ ముఖ్య నిర్వాహకుల్లో ఆయన ఒకరుగా వున్నారు. తమిళనాడులో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించేందుకు ఆయన విశేషంగా కృషి చేశారు. 1995 నుండి 2002 వరకు రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా వున్నారు. 1967, 77, 1980ల్లో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977, 1980ల్లో అసెంబ్లీలో సిపిఎం గ్రూపు నేతగా వున్నారు. రైతు ఉద్యమాన్ని అభివృద్ధిపరిచేందుకు కూడా ఆయన కృషి చేశారు. అనంతర కాలంలో అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడుగా పనిచేశారు.కమ్యూనిస్టు రాజకీయాలను, విధానాలను ప్రజలకు సమర్ధవంతంగా వివరించే మంచి వాగ్ధాటి గల మంచి వక్త అంతకుమించి అంకిత భావం, నిబద్ధత కలిగిన మార్క్సిస్ట్ అని పొలిట్‌బ్యూరో తన సంతాప సందేశంలో పేర్కొంది. పార్టీకి పూర్తిగా అంకితమైన ఆయన ప్రజా జీవితంలో సమగ్రత, నిరాడంబరత వంటి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పారని పొలిట్‌బ్యూరో పేర్కొంది.
- ఎఐకెఎస్ సంతాపం
ప్రముఖ రైతు, కార్మిక కోద్యమ నేత శంకరయ్య మృతికి సంతాపసూచకంగా ఎఐకెకెస్ తన పతాకాన్ని అవనతం చేసింది. 1993లో మొదటి ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాన్ని ఎఐకెఎస్ రూపొందించడంతో శంకరయ్య కీలక పాత్ర పోషించారని, కార్మిక, కర్షక ఐక్యత మరింత బలపడాలని ఆయన నిత్యం అభిలషించేవారనిని, ఎఐకెస్ నేతలు అశోక్ ధావలె, విజూ కృష్ణన్ తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు.
- వ్యవసాయ కార్మిక సంఘం సంతాపం
శంకరయ్య మృతికి అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర వర్కింగ్ కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. భూస్వాములకు వ్యతిరేకంగా సాగించిన పలు పోరాటాలకు ఆయన నాయకత్వం వహించారని పేర్కొంది. అన్ని రూపాల్లోని ఆర్థిక దోపిడీలకు, సామాజిక అణచివేతలకు వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాడిన ధన్యజీవి శంకరయ్య అని సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయరాఘవన్, వెంకట్ పేర్కొన్నారు.
- సిఐటియు సంతాపం
ప్రముఖ కమ్యూనిస్టు నేత శంకరయ్య మృతికి సిఐటియు తీవ్ర సంతాపాన్ని తెలియచేసింది. ఆయన మృతికి సంతాపసూచకంగా అరుణ పతాకాన్ని అవనతం చేసింది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేసింది. ఆయన మృతితో భారత కార్మికోద్యమం త్యాగం, అంకితభావాలను వారసత్వంగా కలిగిన గొప్ప నేతను కోల్పోయిందని పేర్కొంది.
- ఎస్‌ఎఫ్‌ఐ సంతాపం
విద్యార్థి ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఎన్ శంకరయ్య మృతి పట్ల ఎస్‌ఎఫ్‌ఐ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్ బిశ్వాస్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సామ్రాజ్యవాదం, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు విద్యార్థులకు, యువతకు ఆయన సదా స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
- మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు : ఎంకె స్టాలిన్
''కామ్రేడ్ శంకరయ్య చాలా చిన్న వయస్సులో ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి 102 సంవత్సరాల వయసు వరకు దేశం కోసం, కార్మిక వర్గం, తమిళనాడు కోసం విశేష కృషి చేశారని ఆయన త్యాగం తమిళనాడు చరిత్రలో నిలిచిపోతుంది'' అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అన్నారు. ''తన జీవితాన్ని ప్రజా సేవకు గడిపారు. మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడిన, స్వాతంత్య్ర సమరయోధుడు. శంకరయ్యకు నివాళి. తమిళనాడుకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా అధికారిక లాంఛనాలతో ఆయనకు వీడ్కోలు పలుకుతాం'' అని ఎంకె స్టాలిన్ తెలిపారు.
- కార్మిక-కర్షక ఉద్యమానికి తీరని లోటు : పినరయి
''ఎన్. శంకరయ్య మరణం దేశంలోని కార్మిక-కర్షక ఉద్యమానికి తీరని లోటు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సిపిఎం వ్యవస్థాపక నాయకులలో ఒకరిగా, రైతాంగ ఉద్యమ నాయకుడిగా ఆయన వారసత్వం మనందరికీ సోషలిస్టు సమాజాన్ని సాకారం చేసేందుకు పోరాటాల నిర్మాణంలో దృఢంగా నిలబడేలా స్ఫూర్తినిస్తుంది. వీడ్కోల్ లాల్ సలామ్, కామ్రేడ్'' అని పినరయి విజయన్ తెలిపారు.
- ఆయన జీవితం సోషలిజం కోసం అంకితం: ఏచూరి
''ఎన్ శంకరయ్యకు లాల్ సలాం. ఎన్ శంకరయ్య, భారత కమ్యూనిస్టు ఉద్యమ స్థాపకుల్లో ఒకరు. అంకితమైన మార్క్సిస్ట్-లెనినిస్ట్‌గా, ఆయన తన జీవితాన్ని దేశ సోషలిస్ట్ పరివర్తనకు అంకితం చేశాడు. ఆయన కుటుంబ సభ్యులకు, సహచరులకు ప్రగాఢ సానుభూతి'' అని సీతారాం ఏచూరి పేర్కొన్నారు.
- కమ్యూనిస్టు ఉద్యమం మార్గదర్శిని కోల్పోయింది: డి.రాజా
''ఎన్ శంకరయ్య మరణంతో కమ్యూనిస్టు ఉద్యమం సమర్థుడైన మార్గదర్శిని కోల్పోయింది'' అని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు.
- ఎన్‌రామ్‌తో సహా పలువురు ప్రముఖుల నివాళి
బుధవారం కన్నుమూసిన సీనియర్ సిపిఎం నేత, కమ్యూనిస్టు యోధుడు శంకరయ్యకు ప్రముఖ పాత్రికేయులు, ది హిందూ పత్రిక మాజీ ఎడిటర్ ఎన్ రామ్‌తో సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. సిపిఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్, సీనియర్ నాయకుడు టికె రంగరాజన్, కేంద్ర కమిటీ సభ్యులు ఎ.కె.పద్మనాభన్, పి.షణ్ముఖం, యు.వాసుకి తదితరులు ప్రియతమ నేతకు నివాళులర్పించారు. తమిళనాడు మంత్రులు దురై మురుగన్, కె పొన్ముడి, ఉదయనిధి స్టాలిన్, డిఎంకె ఎంపిలు టిఆర్ బాలు, ఎ.రాజా, సిపిఐ సీనియర్ నాయకుడు ఆర్ నల్లకణ్ణ, ఎండిఎంకె నేత వైగో, విసికె ఎంపి తిరుమవలవలన్, సీనియర్ వివిధ పార్టీల నాయకులు, పలువురు ప్రముఖలు శంకరయ్యకు నివాళులర్పించారు.
గౌరవ డాక్టరేట్ ప్రతిపాదన
- గౌరవ డాక్టరేట్ ప్రతిపాదన
చెన్నై: 2021లో ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె ప్రభుత్వం స్థాపించిన తగైసల్ తమిజార్ (ప్రముఖ తమిళం) అవార్డును శంకరయ్య తొలిసారిగా స్వీకరించారు. డిఎంకె ప్రభుత్వం కూడా శంకరయ్యను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించేందుకు మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం చేసిన ప్రతిపాదనకు మద్దతు ఇచ్చింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలపలేదు. నవంబర్ 2న యూనివర్శిటీ స్నాతకోత్సవం సందర్భంగా ఫైల్‌పై సంతకం చేయకూడదని గవర్నర్ ఆర్‌ఎన్ రవి తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడి రెండు వర్శిటీ స్నాతకోత్సవాలను బహిష్కరించారు. బుధవారం సిఎం స్టాలిన్ గవర్నర్ రవి పేరు చెప్పకుండానే శంకరయ్యకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడంలో జాప్యంపై విరుచుకుపడ్డారు. ఈ సమయంలో ''తమిళనాడుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర తెలియని చిన్న మనసున్న వ్యక్తుల పట్ల నేను చింతిస్తున్నాను. వారి ద్రోహానికి నేను చింతిస్తున్నాను'' అని స్టాలిన్ అన్నారు.
- జీవితమంతా ప్రజల కోసమే..
శంకరయ్య 1922లో జులై 15న ట్యూటికోరిన్‌లోని కోవిల్‌పట్టిలో జన్మించారు. ఆయన భార్య నవమణి. శంకరయ్యకు ఇద్దరు కుమారులు చంద్రశేఖర్, నరసింహన్ (సిపిఎం దక్షిణ చెన్నై జిల్లా కమిటీ సభ్యుడు), కుమార్తె చిత్ర ఉన్నారు. శంకరయ్య జూలై 2021లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మెట్రిక్యులేషన్ తరువాత శంకరయ్య 1937లో మదురైలోని అమెరికన్ కాలేజీలో చరిత్రను అభ్యసించారు. మద్రాసు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులలో ఒకరు. మదురై స్టూడెంట్స్ యూనియన్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సమయంలో ఆయన దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడం ప్రారంభించారు. మదురైలోని అమెరికన్ కాలేజీలో హిస్టరీ స్టూడెంట్‌గా ఉన్న శంకరయ్య తన చివరి పరీక్షలకు ముందు 1941లో మొదటిసారి అరెస్టయ్యారు. దీంతో ఆయన డిగ్రీ పొందలేకపోయారు. 1947 ఆగస్టులో దేశానికి స్వాతంత్య్రం లభించే ముందు రోజు విడుదలైన అనేక మంది కమ్యూనిస్టులలో శంకరయ్య ఒకరు. మొదటి సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్ట్ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. శంకరయ్య రాజకీయ జీవితం ఏడు దశాబ్దాల పాటు కొనసాగింది. బ్రిటిష్ పాలనలో ఎకె గోపాలన్, కామరాజ్ వంటి సీనియర్ నాయకులతో పాటు అనేక సార్లు ఆయన జైలు కళ్లారు.. కయ్యూరు సహచరులను ఉరితీసే సమయంలో శంకరయ్య కూడా కన్నూరు జైలులో ఖైదీగా ఉన్నారు. 2018 ఏప్రిల్‌లో సిపిఎం హైదరాబాద్ పార్టీ అఖిల భారత మహాసభ ఎర్ర జెండాను పట్టుకుని పోరాట, రాజకీయ జీవితాన్ని నడిపించిన విఎస్ అచ్యుతానంద్, శంకరయ్యలను ఘనంగా సన్మానించింది.సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడుగా, ఎఐకెఎస్ నాయకునిగా పలు బాధ్యతలు నిర్వహించారు. 1995 నుంచి 2002 వరకు సిపిఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. శంకరయ్య 1967లో మదురై పశ్చిమ నియోజకవర్గం నుండి, 1977, 1980ల్లో మధురై తూర్పు నియోజకవర్గం నుండి తమిళనాడు శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన 1977, 1980లో అసెంబ్లీలో సిపిఎం పక్ష నాయకుడిగా ఉన్నారు.