Aug 20,2023 12:32

న్యూఢిల్లీ  :  తన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియా ట్రోలర్స్‌ నుండి వచ్చిన ఒత్తిడితోనే అన్‌అకాడమీ తనను తొలగించిందని ఉపాధ్యాయుడు కరణ్‌ సంగ్వాన్‌ తెలిపారు.  విద్యావంతులైన వారికే ఓటు వేయాలని తాను చేసిన సాధారణ వ్యాఖ్యను తప్పుగా అర్థం చేసుకుని సంస్థ తనను తొలగించిందని మండిపడ్డారు.  తాను యూట్యూబ్‌ ఛానల్‌లో ఈ వ్యాఖ్యను పోస్ట్‌ చేశానని, అన్‌అకాడమీలో కాదని అన్నారు. ఈ విషయాన్ని సంస్థ   ప్రస్తావించకుండా తనను తొలగించిందని అన్నారు.

ఇటీవల ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌అకాడమీ కరణ్‌ సంగ్వాస్‌ను ఉపాధ్యాయుని పదవి నుండి  తొలగించిన సంగతి తెలిసిందే. తనను తొలగించే ముందు అన్‌అకాడమీ తన నుండి ఎలాంటి వివరణ తీసుకోలేదని అన్నారు. సోషల్‌ మీడియా నుంచి వచ్చే ఒత్తిడిని సంస్థ ఎదుర్కోలేకపోయిందని, అందుకే తనను తొలగించాల్సి వచ్చిందేమోనని అన్నారు. అన్‌అకాడమీ ఉద్దేశ్యాన్ని తాను ఎలా చెప్పగలనని అన్నారు. సంస్థ నేరుగా తనకు రద్దు నోటీస్‌ను పంపారు గానీ ట్రోలర్స్‌ ఒత్తిడి గురించి చెప్పలేదని అన్నారు. ప్రవర్తన నియామావళి ఉల్లంఘించారని ఆరోపించిందని పేర్కొన్నారు.

తాను చేసిన సాధారణ వ్యాఖ్య కారణంగా బెదిరింపులు వచ్చాయని కరణ్ తెలిపారు. తనను దేశ  వ్యతిరేకినని నిందించారని, చంపేస్తా'మని  ఒక వ్యక్తి నుండి  బెదిరింపులు వచ్చాయని పేర్కొన్నారు. సంస్థ తనను తొలగించిన తర్వాత లక్షలాది మంది నుండి  మద్దతు లభించిందని తెలిపారు. రాజకీయ నేతలు కూడా అన్‌అకాడమీ చర్యను ప్రశ్నించారని అన్నారు. వివాదాన్ని మరింత పెంచేందుకే తన ఇంటర్వ్యూని ఓ వార్తా సంస్థ ఎడిట్‌ చేసిందని మండిపడ్డారు.