- మొదటి విన్యాసం విజయవంతం
- మరొక విన్యాసానికి షెడ్యూలు నిర్ణయించిన ఇస్రో
- నాలుగు నెలల్లో నిర్దేశిత కక్ష్యలో ప్రవేశించనున్న ఆదిత్య ఎల్ -1
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సూర్యునిపై పరిశోధనకు ప్రయోగించిన ఆదిత్య ఎల్ -1 ఆదివారం మరొక మైలురాయిని అధిగమించింది. తన మొదటి అడుగును విజయవంతంగా వేసినట్టు ఇస్రో తెలియజేసింది. ఆదిత్య ఎల్ -1 ఉపగ్రహం ఆరోగ్యవంతంగా ఉందని, సాధారణంగా తెరుచుకుందని ఇస్రో తన తాజా ప్రకటనలో వివరించింది. తదుపరి విన్యాసాన్ని మంగళవారం ఉదయం 3 గంటలకు షెడ్యూల్ చేసినట్టు తెలిపింది. శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 సూర్యుని మీద సవివరమైన అధ్యయనం జరపడానికి ఏడు వేర్వేరు పేలోడ్లను మోసుకెళుతున్న విషయం తెలిసిందే. వీటిలో నాలుగు పేలోడ్లు సూర్యుని నుంచి వచ్చే కాంతిని పరిశీలించనుండగా, మరో మూడు సూర్యుని ప్లాస్మా , అయస్కాంత క్షేత్రాలను అధ్యయనం చేయనున్నాయి. ఆదిత్య ఎల్ - 1 మిషన్ సూర్యుని దిశగా భూమి నుండి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక వర్తులాకార కక్ష్య అయిన లాంగ్రేంగియన్ పాయింట్ 1 (ఎల్1)లో పరిభ్రమించనుంది. ఈ కక్ష్య సూర్యునికి, భూమికి మధ్య దూరంలో 1 శాతం ఉంటుంది. ఈ కక్ష్యలోకి ప్రవేశించడానికి ఆదిత్య ఎల్ - 1 మిషన్‌కు నాలుగు నెలల వ్యవధి పట్టనుంది.
ఆదిత్య ఎల్-1 సూర్యుని వెలుపలి వాతావరణాన్ని అధ్యయనం చేస్తుందని, సూర్యుడిని సమీపించడం గాని, సూర్యునిపై ల్యాండ్ కావడం గాని జరగదని ఇస్రో వెల్లడించింది. ప్రస్తుతం నిర్ణయించిన కక్ష్య గ్రహణాలు గాని, మరే ఇతర ఆటంకాలు గాని లేకుండా సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంపై వాటి ప్రభావాలను వాస్తవ సమయం ఆధారంగా అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలకు వీలుకల్పించనుంది. ఆదిత్య ఉపగ్రహం పంపే డేటా సౌర విస్ఫోటన ఘటనల ప్రక్రియల వరుస క్రమాన్ని గుర్తించి, అంతరిక్ష వాతావరణాన్ని ప్రభావితం చేసే కారకాలను మరింత లోతుగా అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడనుంది.
సూర్యుని వెలుపరి పొర అయిన కరోనా, దాని ఉష్ణ యంత్రాంగం భౌతిక ధర్మాలను అధ్యయనం చేయడం, సౌర పవన త్వరణం, సౌర వాతావరణ గతిశీలత, సౌర వాయువుల వ్యాప్తి, ఉష్ణోగ్రత లక్షణాలు, కరోనా మాస్ ఎజెక్షన్స్, జ్వాలలు, భూమికి సమీపంలో ఉన్న అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేయడం కోసం ఆదిత్య మిషన్‌ను ఇస్రో ప్రారంభించిన సంగతి తెలిసిందే.