Jul 05,2023 09:47

ఉత్తరకాశీ : జోషిమఠ్‌ తరువాత ఉత్తరకాశీలో మరొక గ్రామంలో విస్తృతంగా భూమి బీటలు వారడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. మస్తారి గ్రామంలో రోడ్లకు, అనేక ఇళ్ల గోడలకు పగుళ్లు కనిపించడంతో ప్రజల్లో ఆందోళన నెలకుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తరకాశీ జిల్లా జోషిమఠ్‌లో భూమి బీటలు వారడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం అదే రీతిలో మస్తారి గ్రామంలో పరిస్థితులు నెలకొనడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో నిరంతరం కొండచరియలు విరిగిపడుతున్నా అధికారులు దృష్టి పెట్టడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1997లో మస్తారి గ్రామాన్ని సందర్శించిన భూగర్భ శాస్త్రజ్ఞులు గ్రామంలో సర్వే నిర్వహించి కొన్ని రక్షణ చర్యలను సూచించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నెల 1 రాత్రి కురిసిన భారీ వర్షానికి పగుళ్లు ఏర్పడ్డం ప్రారంభమైందని, అవి క్రమంగా పెద్దవవుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వం తమను వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.